ఐపీఎల్‌ను నెంబర్ వన్ లీగ్‌గా తీర్చిదిద్దుతాం.. ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : అరుణ్ ధుమాల్
ఇప్పటికే మీడియా రైట్స్ ద్వారా వేలాది కోట్లు ఆర్జించి బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం కలిగిన లీగ్‌గా తీర్చిదిద్దుతామని కొత్త చైర్మెన్ అరుణ్ ధుమాల్ అంటున్నాడు.
ఈ ఏడాది జూన్ లో ముగిసిన ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా రూ. 48 వేల కోట్లు ఆర్జించిన ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన లీగ్ లలో రెండో స్థానంలో ఉంది. యూరోపియన్ లో అత్యధిక ప్రాచుర్యం కలిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ను సైతం పక్కకు నెట్టి ఐపీఎల్ రెండో స్థానానికి వెళ్లింది. అయితే దీనిని నెంబర్ వన్ స్థానానికి చేర్చడమే తమ ముందున్న లక్ష్యమని ఐపీఎల్ కొత్త చైర్మెన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరుగనున్న నేపథ్యంలో ధుమాల్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ క్రీడా యవనికపై అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) ఒక్కటే ఐపీఎల్ కంటే ముందుంది. బ్రాండ్ వాల్యూలో ఎన్ఎఫ్ఎల్ తర్వాత ఉన్న ఐపీఎల్ ను వచ్చే ఐదేండ్లలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తామని ధుమాల్ తెలిపాడు.
ధుమాల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఐపీఎల్ ఉన్న స్థితి నుంచి దానిని మరింత పెంచుతాం. ఈ లీగ్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ లీగ్ గా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఈ మేరకు మేం తగు చర్యలు తీసుకుంటున్నాం. ఆటను చూసే అభిమానులకు మ్యాచ్ ల పట్ల ఆసక్తి కలిగించే విధంగా కొత్త టెక్నాలజీతో వినోదాన్ని అందించనున్నాం. అలాగే స్టేడియాల్లో ఉన్నవారికి కూడా సదుపాయాలు, కావాల్సిన వసతులు కల్పిస్తాం. దీంతో పాటు ఇకనుంచి మేం ఐపీఎల్ షెడ్యూల్ ను ముందే విడుదల చేయాలని భావిస్తున్నాం. తద్వారా ఇతర దేశాల ఆటగాళ్లు కూడా వారి షెడ్యూల్ ను చూసుకుని తదనుగుణంగా తమ ప్రణాళికలు సెట్ చేసుకుంటారు..’ అని అన్నాడు.
ఐపీఎల్ లో ఫ్రాంచైజీల సంఖ్యను పెంచే ఉద్దేశముందా..? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. ఇప్పటికే మేం పది ఫ్రాంచైజీలతో ఆడుతున్నాం. జట్లు మరీ ఎక్కువైతే కూడా లీగ్ ను సక్రమంగా నిర్వర్తించడం కష్టమవుతుంది. టీమ్ లు అయితే 10 ఉంటాయి. కానీ మ్యాచ్ సంఖ్యను ప్రస్తుతం ఉన్నదానికంటే పెంచుతున్నాం. ప్రస్తుతానికి 74 మ్యాచ్ లు ఉండగా తర్వాత అవి 84, 94 కాబోతున్నాయి. క్రికెట్ ను ఫుట్బాల్, ఇతర ఆటలతో పోల్చడానికి లేదు. మీరు ఒకే పిచ్ పై ఆరు నెలల పాటు మ్యాచ్ ఆడలేరు..’ అని తెలిపాడు.
ఇక దేశవాళీ, జాతీయ జట్టులో ఆడుతూ బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లను ఇతర దేశాలలో జరిగే లీగ్ లలో అనుమతించబోమని ధుమాల్ కరాఖండీగా చెప్పేశాడు. ‘లేదు. బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న ఏ ఒక్క ఆటగాడిని కూడా ఇతర లీగ్ లలోకి అనుమతించం. ఇది బీసీసీఐ పెట్టుకున్న నియమం. ఫ్రాంచైజీ క్రికెట్ కు క్రేజ్ పెరుగుతున్న దృష్ట్యా పలువురు ఈ ప్రతిపాదనను తీసుకొస్తున్నారు. కానీ ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికైతే అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం..’ అని కుండబద్దలు కొట్టాడు.