ఆ ఘనతకు నేటితో 24 ఏండ్లు.. అద్భుతం చేసిన అనిల్ కుంబ్లే.. పాక్ పతనాన్ని శాసించిన ఆ వీడియోను చూశారా..?
Anil Kumble 10 Wickets: భారత క్రికెట్ చరిత్రలో నేడు (ఫిబ్రవరి 7) సువర్ణాక్షరాలతో లిఖించిదగిన రోజు. భారత లెగ్ స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే పాకిస్తాన్ వెన్నువిరిచి ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లు నేలకూల్చింది ఇవాళే..

భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని ఘనతలు ఎన్నో ఉన్నా అందులో కొన్ని ఎప్పటికీ నిత్య నూతనమే. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పిన్ ఉచ్చులో చిక్కుకుని దాయాది దేశం బ్యాటర్లు పేకమేడలా కూలిన ప్రదర్శన ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఆ అద్భుతానికి నేటికి 24 ఏండ్లు నిండాయి. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఆ మ్యాచ్ లో కుంబ్లే ధాటికి పాకిస్తాన్ విలవిల్లాడింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ లోని పదికి పది మందీ కుంబ్లే స్పిన్ సుడిగుండంలో చిక్కుకున్నవారే కావడం గమనార్హం. నేటికి 24 ఏండ్లు గడిచిన ఈ మ్యాచ్ లో కుంబ్లే అద్భుతానికి పునాది ఎలా పడిందో ఇక్కడ చూద్దాం.
అది 1999. పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. రెండు టెస్టులు ఆడేందుకు గాను దాయాదులు భారత్ కు వచ్చారు. చెన్నైలో తొలి టెస్టు. సచిన్ టెండూల్కర్ సెంచరీతో రాణించినా ఆ మ్యాచ్ లో భారత్.. 12 పరుగుల తేడాతో ఓడింది. ఢిల్లీలో రెండో టెస్టు. గెలిస్తే భారత్ కు స్వదేశంలో దారుణ అవమానం. దీంతో ఒత్తిడి పూర్తిగా భారత్ పై నిలిచింది.
దీనికి కొనసాగింపా అన్నట్టుగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన భారత్.. 252 పరుగులకే ఆలౌట్ అయింది. శఠగోపన్ రమేశ్ (60), మహ్మద్ అజారుద్దీన్ (67) లు మాత్రమే మెరిశారు. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీ, నయాన్ మోంగియా విఫలమయ్యారు. ప్రస్తుత పాక్ టీమ్ హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక ఐదు వికెట్ల (5-94) తో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు మెరుగ్గా రాణించారు. పాక్ బ్యాటర్లలో షాహిద్ అఫ్రిది (32) తప్ప అంతా విఫలం. 172 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. కుంబ్లేకు నాలుగు, హర్భజన్ కు 3, వెంకటేశ్ ప్రసాద్ కు రెండు వికెట్లు దక్కాయి.
రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో మెరిసింది. రమేశ్ (96) తో పాటు గంగూలీ (62), జవగళ్ శ్రీనాథ్ (49) రాణించారు. భారత్ 339 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో కలుపుకుని టీమిండియా.. పాకిస్తాన్ ఎదుట 420 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
అప్పుడు మొదలైంది జంబో మాయ...
లక్ష్య ఛేదనలో పాక్ ఓపెనర్లు బెదరలేదు. సయీద్ అన్వర్ (69), అఫ్రిది (41) లు తొలి వికెట్ కు 101 పరుగులు జోడించారు. కానీ కుంబ్లే వేసిన పాక్ ఇన్నింగ్స్ 24వ ఓవర్లో అఫ్రిది ఇచ్చిన క్యాచ్ ను వికెట్ కీపర్ నయాన్ మోంగియా అందుకున్నాడు. ఫస్ట్ వికెట్ ఔట్. అప్పుడు మొదలైంది జంబో మాయ. ఆ వెంటనే ఇజాజ్ అహ్మద్ (0) డకౌట్ అయ్యాడు. ఇంజమామ్ ఉల్ హక్ (6), మహ్మద్ యూసుఫ్ (0), మోయిన్ ఖాన్ (3).. ఇలా వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్ చేరుతున్నారు.
పాక్ పతనాన్ని కళ్లారా చూస్తున్న అన్వర్.. ఈ ఘోరాలను తాను చూడలేనన్నట్టుగా.. ఓపిక నశించి పెవిలియన్ చేరాడు. 24.1 ఓవర్లలో 101-0 గా ఉన్న పాక్.. 38 ఓవర్లు ముగిసేసరికి 128-6గా పడిపోయింది. కానీ ఆ టైమ్ లో సమీమ్ మాలిక్ (15), వసీం అక్రమ్ (37) కాసేపు విసిగించారు. ఇద్దరూ కలిసి ఏడో వికెట్ కు 58 పరుగులు జోడించారు. కానీ టీ తర్వాత జంబో మళ్లీ రెచ్చిపోయాడు. సలీమ్ మాలిక్ ను క్లీన్ బౌల్డ్ చేసిన కుంబ్లే.. ఆ తర్వాత వెంటవెంటనే సక్లయిన్ ముస్తాక్, వసీం అక్రమ్ లను కూడా ఔట్ చేసి పాక్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. మొత్తంగా కుంబ్లే ఈ మ్యాచ్ లో 26.3 ఓవర్లు బౌలింగ్ చేసి 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతకు 24 ఏండ్లు నిండటంతో బీసీసీఐ.. కుంబ్లే పది వికెట్ల వీడియోను ట్విటర్ లో షేర్ చేసింది.
ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీయడం ద్వారా కుంబ్లే టెస్టు క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా నిలిచాడు. అంతకుముందు 1956లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ రికార్డును సమం చేశాడు. ఈ ఇద్దరి తర్వాత 2021లో భారత్ సంతతికి చెందిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ యూనస్ పటేల్.. ముంబై వేదికగా ముగిసిన రెండో టెస్టులో భారత్ పై ఈ ఘనత సాధించాడు. అజాజ్.. 47.5 ఓవర్లు వేసి 119 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు.