New Zealand vs South Africa: టామ్ లాథమ్ నేతృత్వంలోని న్యూజిలాండ్ కు స్వదేశంలో ఊహించని షాక్ తగిలింది. సఫారీ బౌలర్ల విజృంభణతో కివీస్ భారీ తేడాతో ఓటమి పాలైంది.
తొలి టెస్టులో ఎదురైన ఓటమికి సౌతాఫ్రికా బదులు తీర్చుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో డీన్ ఎల్గర్ సేన విజయాన్ని అందుకుంది. రెండో టెస్టులో 198 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. హాగ్లీ ఓవల్ వేదికగా ;ప్రపంచ టెస్టు ఛాంపియన్లైన న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో ప్రొటీస్ జట్టు నిలిపిన 426 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. టామ్ లాథమ్ నేతృత్వంలోని కివీస్.. 277 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు ఆటగాడు డెవాన్ కాన్వే ఒంటరి పోరాటం చేసినా కివీస్ పరాజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
హాగ్లీ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు ఓపెనర్ సరెల్ ఎర్వీ (108) సెంచరీ చేశాడు. మార్క్రమ్ (42), ఎల్గర్ (41) రాణించారు. దీంతో ఆ జట్టు133 ఓవర్లలో 364 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ తడబడింది. మిడిలార్డర్ బ్యాటర్లు డరిల్ మిచెల్ (60), గ్రాండ్ హోమ్ (120) రాణించడంతో ఆ జట్టు 293 పరుగులకు ఆలౌటైంది.
71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా కు ఆ జట్టు వికెట్ కీపర్ వెర్రెయిన్నే (136) ఆధిక్యం అందించాడు. అతడికి తోడుగా సఫారీ బౌలర్ రబాడా (47) కూడా బ్యాటింగ్ లో రాణించాడు. దీంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 354 పరుగుల చేసింది. ఫలితంగా కివీస్ ముందు 426 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
అయితే భారీ లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. కాన్వే (92 ) ఒక్కడే ఒంటరిపోరు చేశాడు. అతడికి వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (44), డారిల్ మిచెల్ (24) కాసేపు సహకారం అందించారు. అయితే సఫారీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్ కు ఓటమి తప్పలేదు. చివరికి ఆ జట్టు 93.5 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడా, జాన్సేన్, స్పిన్నర్ కేశవ్ మహారాజ్ లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి టెస్టును కివీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రబాడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. కివీస్ ఆటగాడు హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
