Asianet News TeluguAsianet News Telugu

NZ vs BNG: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ను మట్టికరిపించిన బంగ్లా పులులు

New Zealand Vs Bangladesh: సుమారు 21 ఏండ్ల క్రితం  టెస్టు హోదా పొంది పసికూనల ముద్ర చెరిపేసుకుంటున్న బంగ్లాదేశ్.. తాజాగా సంచలన విజయంతో చరిత్ర సృష్టించింది. తొలి టెస్టులో కివీస్ ను స్వదేశంలో ఓడించి రికార్డులు నెలకొల్పింది. 

NZ vs Bng: Bangladesh Creates history In New Zealand, Won The First Test Match Against Black Caps
Author
Hyderabad, First Published Jan 5, 2022, 1:46 PM IST

వన్డేలు, టీ20లలో సంచలన విజయాలతో మొదలై ఇప్పుడిప్పుడే నిలకడగా విజయాలు అందుకుంటున్న Bangladesh.. తన టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్నది. New Zealandతో మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సంచలన విజయంతో కివీస్ ను మట్టికరిపించింది. బ్యాటింగ్.. బౌలింగ్ లలో  అద్భుతమైన ప్రదర్శన చేసి Block Capsను ఓడించి కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. తాజా విజయంతో బంగ్లాదేశ్.. రెండు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు డ్రా అయితే మాత్రం ఇక బంగ్లా ఆటగాళ్లు కొత్త చరిత్ర సృష్టించినట్టే. 

147 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద ఐదో రోజు ఆట ఆరంభించిన Kiwis.. దానికి మరో 22 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. ఆదుకుంటాడనుకున్న వెటరన్ Ross Taylor తో పాటు రచిన్ రవీంద్ర, జెమీసన్, సౌథీ అందరూ విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు 169 పరుగులకు చాప చుట్టేసింది. బంగ్లా ముందు 42 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిలిపింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్..  16.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఇస్లాం (3), నజ్ముల్ (17) లు త్వరగానే నిష్క్రమించినా.. కెప్టెన్ మొమినుల్ హక్ (13 నాటౌట్), ముష్ఫీకర్ రహీమ్ (5 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. 

 

తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్  328 పరుగులకు ఆలౌట్ కాగా దానికి బంగ్లా ధీటుగా బదులిచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 458 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ 169 పరుగులకే పెవిలియన్ కు చేరింది. 

అతడే హీరో... 

ఈ టెస్టులో బంగ్లాదేశ్ బౌలర్ ఇబాదత్ హుస్సేనే (Ebadot Hussain) హీరో.. తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తో మెరిసిన ఈ యువ పేసర్.. రెండో ఇన్నింగ్స్ లో బ్లాక్ క్యాప్స్ వెన్ను విరిచాడు. ఓపెనర్ విల్ యంగ్ తో పాటు కాన్వే, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్, జెమీసన్ లను ఔట్ చేశాడు.  న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 21  ఓవర్లు వేసి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు.  హుస్సేన్ ధాటికి కివీస్ జట్టులో హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్, జెమీసన్ లు  డకౌట్ అయ్యారు.  సెకండ్ ఇన్నింగ్స్ లో కివీస్ టాప్ స్కోరర్ అయిన రాస్ టేలర్ (40) ను కూడా హుస్సేనే ఔట్ చేశాడు. 

 

ఇదిలాఉండగా.. ఏ ఫార్మాట్ లో అయినా బంగ్లాదేశ్ కు కివీస్ గడ్డపై ఇదే తొలి విజయం. ఎన్నో ఏండ్లుగా కివీస్ పర్యటనలకు వెళ్తున్న బంగ్లా జట్టు ఎప్పుడూ ఉత్త చేతుల్తోనే తిరిగి వస్తున్నది. కానీ తాజాగా మొమినల్ సారథ్యంలోని బంగ్లా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి ప్రపంచ తొలి టెస్టు ఛాంపియన్షిప్ విజేతలను ఓడించారు. కివీస్ ను ఓడించాక బంగ్లా ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి.   డ్రెస్సింగ్ రూమ్ లో ఆ జట్టు ఆటగాళ్లు ఆనందోత్సహాలలో మునిగితేలారు. 

కొత్త రికార్డులు :  

2017 నుంచి కివీస్ స్వదేశంలో టెస్టు ఓడిపోలేదు. 17 టెస్టుల తర్వాత ఆ జట్టుకు ఇది స్వదేశంలో తొలి పరాజయం. కాగా  న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ కు ఇదే తొలి టెస్టు విజయం. వరుసగా 16 టెస్టులు ఓడిన ఆ జట్టు కు ఇదే తొలి గెలుపు. కివీస్ తో 2001 నుంచి ఇప్పటివరకూ 3 ఫార్మాట్లలో కలిపి 32 మ్యాచులు ఆడిన బంగ్లాదేశ్ కు అన్నింటిలో పరాజయమే ఎదురైంది. గతేడాది తమ దేశ పర్యటనకు వచ్చినప్పుడు కివీస్ ను టీ20 లలో మట్టి కరిపించి  సిరీస్ నెగ్గిన బంగ్లా.. ఇప్పుడు తాజాగా బ్లాక్ క్యాప్స్ కు వారి స్వదేశంలో ఓటమి రుచి చూపించింది.

ఇక 2011 తర్వాత న్యూజిలాండ్ ను ఓడించిన ఆసియా జట్టుగా బంగ్లా పులులు నిలిచారు.  అంతకుముందు 2011 జనవరిలో హమిల్టన్ లో జరిగిన టెస్టులో పాక్..  న్యూజిలాండ్ ను ఓడిచింది.  ఇక 2000 నుంచి టెస్టు హోదా పొంది మ్యాచులు ఆడుతున్న బంగ్లా జట్టు ఇప్పటివరకు 127 టెస్టులు ఆడగా.. అందులో 15 విజయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఆస్ట్రేలియా పై కాగా  మరొకటి ఇంగ్లాండ్ మీద కావడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios