నా బౌలింగ్ లోనే ఆరు సిక్సర్లు కొట్టావ్‌గా.. రాసిపెట్టుకో.. అప్పుడు నీ సంగతి చూస్తా.. పాక్ క్రికెటర్‌కు మంత్రి
పాక్ వెటరన్ పేసర్, ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ కు క్రీడా మంత్రిగా వ్యవహరిస్తున్న వహబ్ రియాజ్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. దీంతో మ్యాచ్ ముగిశాక రియాజ్.. ఇఫ్తికార్ కు వార్నింగ్ ఇచ్చాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సన్నాహకాల్లో భాగంగా క్వెట్టాలో రెండ్రోజుల క్రితం ముగిసిన మ్యాచ్ లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పాక్ వెటరన్ పేసర్, ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ కు క్రీడా మంత్రిగా వ్యవహరిస్తున్న వహబ్ రియాజ్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. దీంతో మ్యాచ్ ముగిశాక రియాజ్.. ఇఫ్తికార్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇఫ్తికార్, రియాజ్, కమ్రాన్ అక్మల్ లు ముచ్చటించుకున్నారు. ఇఫ్తికార్ తో రియాజ్ మాట్లాడుతూ.. ‘నా బౌలింగ్ లోనే ఆరు సిక్సర్లు కొట్టావ్ కదా. రాసిపెట్టుకో.. త్వరలోనే పీఎస్ఎస్ రాబోతుంది. అక్కడ నీ పప్పులేమీ ఉడకవు..’అని అన్నాడు.
దానికి ఇఫ్తికార్ స్పందిస్తూ.. ‘అక్కడా ఇదే రిపీట్ అవుద్ది..’అంటూ నవ్వుతూ అన్నాడు. అప్పుడు రియాజ్ మళ్లీ... ‘ఏదైతే అది అయిందిలే గానీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు అనేది గొప్ప అచీవ్మెంట్. కంగ్రాట్స్..’అంటూ ఇఫ్తికార్ ను అభినందించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడిన ఇఫ్తికార్.. అప్పటికే హాఫ్ సెంచరీ చేసి దూకుడుమీదున్నాడు. పెషావర్ జల్మీ తరఫున వహబ్ చివరి ఓవర్ లో బౌలింగ్ కు వచ్చాడు. ఇక రియాజ్ వేసిన ఆఖరి ఓవర్లో ఇఫ్తికార్.. వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. అతడి దూకుడుతో క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. రియాజ్.. ఇటీవలే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు క్రీడా మంత్రిగా ఎంపికైన విషయం తెలిసిందే. అనంతరం లక్ష్య ఛేదనలో పెషావర్.. 181 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా క్వెట్టా మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.