Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్స్‌తో అంత ఈజీ కాదు... రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం...

150 పరుగుల లక్ష్యఛేదనలో 139 పరుగులకి ఆలౌట్ అయిన నార్తాంప్టన్‌షైర్...10 పరుగుల తేడాతో ఇండియన్స్ విజయం... మూకుమ్ముడిగా రాణించిన భారత బౌలర్లు... 

Northamptonshire vs Indians 2nd Warm up match won by Team India, with 10 runs
Author
India, First Published Jul 3, 2022, 11:23 PM IST

డర్బీషైర్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టు, నార్తాంప్టన్‌షైర్ క్లబ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌ని కూడా ఘన విజయంతో ముగించింది. టాపార్డర్‌ ఫెయిల్ కావడంతో 149 పరుగుల స్కోరు మాత్రమే చేసినా భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నార్తాంప్టన్‌షైర్‌ 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 10 పరుగుల తేడాతో ఇండియన్స్ టీమ్‌ గెలుపు నమోదు చేసింది.

150 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ మొదలెట్టిన నార్తాంప్టన్‌షైర్‌ని వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ముప్పుతిప్పలు పెట్టారు భారత బౌలర్లు. ఓపెనర్ రిచర్డో వాస్కోన్‌సెలోస్ 5 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ కాగా 4 పరుగులు చేసిన కెప్టెన్ జోష్వా కాబ్‌ని అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన మరో ఓపెనర్ ఎమిలో గేని ఆవేశ్ కాన్ అవుట్ చేయగా గుస్ మిల్లర్ 5 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

రియాన్ రిక్లేటన్ 3 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కాగా జేమ్స్ సేల్స్ 12 పరుగులు చేసి వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 18 పరుగులు చేసిన నాథన్ బక్, 15 పరుగులు చేసిన బ్రెండన్ గ్లోవర్‌ ఇద్దరూ యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ కాగా ఫెడ్డీ హెల్డ్‌రీచ్‌ని అర్ష్‌దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సైఫ్ జైబ్... 35 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్‌లో ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగుల స్కోరు చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ శాంసన్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు జోష్వా కాబ్. గత నాలుగు మ్యాచుల్లో 39, 18, 77, 38 పరుగులు చేసి సత్తా చాటుతూ వచ్చిన సంజూ శాంసన్, గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ త్రిపాఠి 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి బ్రెండన్ గ్లోవర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా 3 బంతులాడి బ్రెండన్ గ్లోవర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

ఈ దశలో ఇషాన్ కిషన్, కెప్టెన్ దినేశ్ కార్తీక్ కలిసి నాలుగో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఫెడ్డీ హెల్డ్‌రీచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇండియన్స్ టీమ్...

26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన కెప్టెన్ దినేశ్ కార్తీక్, ఫెడ్డీ హెల్డ్‌రీచ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కావడంతో 72 పరుగులకే సగం టీమ్‌ పెవిలియన్‌కి చేరింది...

ఆరంభంలో నెమ్మదిగా ఆడినా ఫెడ్డీ హెల్డ్‌రీచ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టిన హర్షల్ పటేల్, ఆ తర్వా బ్రెండన్ గ్లోవర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు. ఆరో వికెట్‌కి దినేశ్ కార్తీక్‌తో కలిసి 44 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వెంకటేశ్ అయ్యర్, 22 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి నాథన్ బక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత ఆవేశ్ ఖాన్ కూడా నాథన్ బక్ బౌలింగ్‌లోనే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. తాను ఎదుర్కొన్న మొదటి 15 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసిన హర్షల్ పటేల్, ఆ తర్వాత 19 బంతుల్లో 44 పరుగులు చేసి... 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

బ్రెండన్ గ్లోవర్ వేసిన ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన హర్షల్ పటేల్,  36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి అవుట్ అయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios