తాను సెహ్వాగ్, వార్నర్ లా ఆడలేనని టీమిండియా యువ క్రికెటర్ ఛటేశ్వర పుజారా అన్నాడు. తాను తన స్ట్రైక్ రేట్ గురిచి ఎలాంటి ఆందోళన చెందడం లేదని వివరించాడు. కాగా... ఇటీవల పుజారా సరిగా ఆడటం లేదని... చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

ఇటీవల బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఇదే తరహాలో ఆడాడు. జ్వరం నుంచి కోలుకొని ఇన్నింగ్స్‌ కొనసాగించిన పుజారా.. 237 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో సగటు క్రికెట్‌ అభిమానులు మళ్లీ పుజారా ఆటతీరును విమర్శించారు. దీనిపై ఇప్పుడు స్వయంగా పుజారానే స్పందించాడు. 

Also Read ఐపీఎల్‌కు మరో దెబ్బ: 17 మంది ఆసీస్ ఆటగాళ్ల గుడ్‌బై...?.

'నా స్ట్రైక్‌రేట్‌ గురించి మీడియాలోనే అనేక రకమైన వార్తలు కనిపిస్తాయి. అయితే జట్టు అంతర్గత చర్చల్లో మాత్రం దీని గురించి అసలు ప్రస్తావనే ఉండదు. ఈ విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాకు పూర్తిగా మద్దతిస్తోంది. వేగంగా ఆడాలంటూ కెప్టెన్‌ నుంచి గానీ కోచ్‌ నుంచి గానీ నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు' అని పుజారా తెలిపాడు.

తాను డేవిడ్ వార్నర్ , వీరేంద్ర సెహ్వాగ్ కాదని తనకు తెలుసన్నాడు. కానీ ఒక బ్యాట్స్ మన్ కాస్త సమయం తీసుకుంటే తప్పులేదని చెప్పాడు. జనం తన నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారని దానిని తాను ఎప్పుడూ సవాల్ గా తీసుకుంటానని చెప్పాడు. 

ప్రస్తుత కాలంలో ఏ క్రికెటరైనా నెమ్మదిగా ఆడితే.. అభిమానులకు విసుగు వచ్చే అవకాశం ఉందని పుజారా పేర్కొన్నాడు. అయితే.. ప్రత్యర్థి అలసిపోయేలా చేయడంలో బాగుంటుందన్నాడు. ఎక్కువ సేపు క్రీజులో ఉండటం  మంచిదేనని అభిప్రాయపడ్డాడు. దానికి చాలా విలువ ఉంటుందని సమర్థించుకున్నాడు.

టీ20  కాలంలో టెస్టు మ్యాచ్ లు ఎవరికీ రుచించవని..కానీ ఎక్కువ టెస్టు మ్యాచులే  జరుగుతాయని చెప్పాడు. 'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. డబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి కుర్రాళ్లు టెస్టులకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. ఇందులో తప్పేమీ లేదు. కానీ టెస్టులకు కూడా ప్రత్యేకత ఉంది. ఒక ఆటగాడి అసలు సత్తాను ఐదు రోజుల మ్యాచ్‌లే బయటపెడతాయి' అని పుజారా చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌ తమకు అత్యంత కీలకమన్నాడు. మన పేసర్లు పూర్తి ఫిట్‌నెస్, తగినంత విరామంతో సిద్ధంగా ఉంటే మళ్లీ సిరీస్‌ గెలవవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.