న్యూజిలాండ్ మహిళా జట్టు కెప్టెన్ అమీ శాటర్త్‌వైట్ తల్లికాబోతోంది. తాను గర్భం దాల్చానంటూ ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ఆమె ప్రకటన అందరనీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఓ మహిళ గర్భం దాల్చడం సహజమే అయినా మహిళా దంపతులు సంతానాన్ని పొందుతుండటమే అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తోంది. అయితే వివిధ వైద్య పద్దతుల ద్వారా గర్భాన్ని పొందే అవకాశముంది కాబట్టి శాటర్త్‌వైట్ మహిళా భాగస్వామిని కలిగివున్నప్పటికి ఆ పద్దతుల్లోనే గర్భందాల్చి వుంటుందని  తెలుస్తోంది. ఆమె మాత్రం ఎలా గర్భందాల్చారో బయటపెట్టలేదు.

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమి శాటర్‌వైట్ సహచర క్రీడాకారిణి లీ తహుహు లు కలిసి చాలాకాలంపాటు సహజీవనం చేశారు. కొంతకాలం క్రితమే వీరిద్దరు తమ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుని దంపతులుగా మారారు. ఇలా ఇద్దరు మహిళలు అందులోనూ సెలబ్రిటీ హోదా కలిగిన క్రికెటర్లు పెళ్లిచేసుకోవడం అసహజ చర్యగా అప్పట్లో కొంతమంది విమర్శించారు. తాజాగా ఈ  దంపతులు సంతానాన్ని పొందనున్నట్లు ప్రకటించడం మరింత చర్చకు దారితీస్తోంది.

అయితే ఎవరేమన్నా లీయాతో కలిసి తాను చాలా సంతోషంగా  వున్నట్లు అమీ వెల్లడించింది. '' తాను గర్భవతినని తెలియగానే ఆమె ఎంతో సంతోషించింది. మరికొద్ది రోజుల్లో మా జీవితంలోకి చిన్నారి ప్రవేశించనుంది. మాకు ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం. కాబట్టి కొంత కాలం క్రికెట్ కు దూరంగా వుండాల్సి  వస్తోంది. అవసరమైతే జట్టుకు  మెంటార్ గా వ్యవహరిస్తాను.'' అంటూ శాటర్త్‌వైట్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. 

2020 జనవరిలో ఆ మహిళా క్రికెటర్ దంపతులు సంతానాన్ని పొందనున్నారు. అప్పటివరకు శాటర్త్‌వైట్ క్రికెట్ కు దూరంగా వుడనుంది. ఇందుకోసం ఆమెకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాతృత్వ సెలవులు కూడా  మంజూరుచేసింది. అయితే ఈ జంట ఏ పద్దతిలో సంతానాన్ని పొందుతున్నారో మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. 

శాటర్త్‌వైట్ న్యూజిలాండ్ జట్టు తరపున 119 వన్డేలు, 99టీ20లు ఆడింది. అలాగే తహుహు 116 మ్యాచులాడింది. అంతర్జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాతే వీరిద్దరి మనసులు కలిసి సహజీవనం  ప్రారంభించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు సంతానాన్ని పొందుతున్నారు.