శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ లో ఓటమిపాలైన పర్యాటక జట్టుకు ఐసిసి మరో షాకిచ్చింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చేసిన బౌలింగ్ అనుమానాస్పదంగా వుందంటూ ఐసిసికి ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే స్పందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విలియమ్సన్ కు నోటీసులు జారీ చేసింది. 

విలియమ్సన్ తో పాటు శ్రీలంక బౌలర్ అకిల దనుంజయ బౌలింగ్  శైలిపై కూడా మ్యాచ్ రిఫరీ అనుమానం వ్యక్తం చేశాడు. వీరిద్దరి బౌలింగ్ శైలి అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు లోబడి వుందో లేదో పరిశీలించాల్సిందిగా రిఫరీ ఐసిసి ని కోరాడు. దీంతో 14 రోజుల్లో తమ ముందు హాజరవ్వాల్సిందిగా ఐసిసి వీరిద్దరికి నోటీసులు జారీ  చేసింది. నిపుణుల సమక్షంలో వీరిద్దరి బౌలింగ్ శైలిని పరిశీలించనున్నట్లు ఐసిసి అధికారులు వెల్లడించారు. 

ఆదివారం ముగిసిన మొదటి  టెస్ట్ మ్యాచ్ లో కివీస్ పై ఆతిథ్య జట్టే పైచేయి సాధించింది. శ్రీలంక ఆరు  వికట్ల తేడాతో విజయం సాధించి కివీస్ పై 1-0 ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 249, రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులు చేసింది. లంక మొదటి ఇన్నింగ్స్ లో 267, రెండో ఇన్నింగ్స్ లో కివీస్ నిర్దేశించిన 268 పరుగులను నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ దిముత్ కరుణరత్నే సెంచరీ (122 పరుగులు)తో చెలరేగి లంక గెలుపులో కీలకపాత్ర పోషించాడు.  

ఈ మ్యాచ్ లో అఖిల దనంజయ మొదటి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్లు పడగొట్టాడు. అలాగే విలియమ్సన్ రెండో ఇన్నింగ్స్ లో మూడు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు.