ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 1 పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్... 95 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన జో రూట్.. 1-1 తేడాతో టెస్టు సిరీస్ సమం చేసిన కివీస్..
ఒక్క మార్కు తేడాతో పరీక్ష ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది ఆ బాధ ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌కి తెలిసి వచ్చింది. ఒక్క పరుగు తేడాతో పరీక్ష గట్టిక్కెతే... ఆహా! ప్రాణాలు లేచివచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు న్యూజిలాండ్ టీమ్ ఫీలింగ్ కూడా ఇదే. పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తూ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు, రెడ్ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఫుల్లు మజాని అందించింది. స్వదేశంలో తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో చిత్తు ఓడిన న్యూజిలాండ్, రెండో టెస్టులో 1 పరుగు తేడాతో గెలిచి సిరీస్‌ని సమం చేసింది..
తొలి ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి ఉత్కంఠ విజయం సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 435/8 పరుగులు చేసి డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్. న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది...
అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేన్ విలియంసన్ 132, టామ్ బ్లండెల్ 90, టామ్ లాథమ్ 83, డివాన్ కాన్వే 61, డార్ల్ మిచెల్ 54 పరుగులు చేసి ఆదుకోవడంతో 483 పరుగుల భారీ స్కోరు చేసింది న్యూజిలాండ్. 257 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్.. 74.2 ఓవర్లలో 256 పరుగులకి ఆలౌట్ అయ్యి 1 పరుగు తేడాతో ఓటమి మూటకట్టుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ చేసిన జో రూట్ 113 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 పరుగులు చేసి, ఇంగ్లాండ్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాక్ క్రావ్లే 24, బెన్ డక్లెట్ 33, ఓల్లీ రాబిన్‌సన్ 2, ఓల్లీ పోప్ 14 పరుగులు చేయగా యంగ్ సెన్సేషన్ హారీ బ్రూక్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు..
80 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో బజ్‌బాల్ కాన్సెప్ట్‌ని పక్కనబెట్టిన కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. 116 బంతులాడిన బెన్ స్టోక్స్ 6 ఫోర్లతో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బెన్ ఫోక్స్ 35, స్టువర్ట్ బ్రాడ్ 11 పరుగులు చేయగా జేమ్స్ అండర్సన్ 4 పరుగులు చేసి అవుట్ కావడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కి తెరపడింది..
న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ 4 వికెట్లు తీయగా టిమ్ సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టుకి ఇది రెండో ఓటమి. 1 పరుగు తేడాతో గెలిచిన రెండో జట్టుగా న్యూజిలాండ్ అరుదైన జాబితాలో చేరింది. ఇంతకుముందు 1993లో వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టెస్టులో 1 పరుగు తేడాతో గెలిచింది..
2000 తర్వాత ఫాలోఆన్ ఆడి గెలిచిన రెండో జట్టుగా నిలిచింది న్యూజిలాండ్. ఇంతకుముందు 2001లో టీమిండియా, ఆస్ట్రేలియాపై ఫాలోఆన్ ఆడి చారిత్రక విజయం సాధించింది.
