NZ vs PAK: న్యూజిలాండ్ వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో ఆతిథ్య జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఈ సిరీస్ లో వరుసగా రెండో విజయాన్ని అందుకుని ఫైనల్ కు చేరువైంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో ఆతిథ్య కివీస్ వరుసగా రెండో విజయం సాధించింది. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో తమను ఓడించిన పాకిస్తాన్ పై కివీస్ బదులు తీర్చుకుంది. క్రిస్ట్‌చర్చ్ వేదికగా ముగిసిన పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ లో కివీస్.. 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. లక్ష్యాన్ని కివీస్.. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
క్రిస్ట్‌చర్చ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైంది. తన కెరీర్ లో అత్యద్భుత ఫామ్ లో ఉన్న పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (16) తో పాటు కెప్టెన్ బాబర్ ఆజమ్ (21), షాన్ మసూద్ (14), షాదాబ్ ఖాన్ (8) లు విషలమయ్యారు.
ఇఫ్తికార్ అహ్మద్ (27) టాప్ స్కోరర్ కాగా చివర్లో అసిఫ్ అలీ (25 నాటౌట్) రాణించి పాకిస్తాన్ కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌధీ, మిచెల్ సాంట్నర్, బ్రాస్వెల్ తలా రెండు వికెట్లు తీశారు. ఇష్ సోధీకి ఒక వికెట్ దక్కింది.
స్వల్ప లక్ష్యాన్ని కివీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (42 బంతుల్లో 62, 1 ఫోర్, 6 సిక్సర్లు), డెవాన్ కాన్వే (46 బంతుల్లో 49 నాటౌట్, 5 ఫోర్లు), విజయాన్ని ఖాయం చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 117 పరుగులు జోడించారు. చివర్లో అలెన్ ను షాదాబ్ ఖాన్ ఔట్ చేసినా.. కేన్ విలియమ్సన్ (9 నాటౌట్) తో కలిసి కాన్వే విజయాన్ని పూర్తి చేశాడు.
ముక్కోణపు సిరీస్ లో భాగంగా కివీస్, పాకిస్తాన్ తలా మూడు మ్యాచ్ లు ఆడి రెండింటిలో గెలిచాయి. ఒకదాంట్లో ఓడాయి. బంగ్లాదేశ్ మాత్రం రెండు మ్యాచ్ లు ఆడి రెండింట్లో ఓడింది. దీంతో ఫైనల్ కు పాక్, కివీస్ వెళ్లడం లాంఛనమే. ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఫైనల్ కు ముందు చివరి మ్యాచ్ బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య ఈనెల 12న జరుగుతుంది. ఈనెల 14న ఫైనల్ క్రిస్ట్‌చర్చ్ లో జరుగుతుంది. ఆ తర్వాత మూడు జట్లూ ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ ఆడేందుకు గాను పయనమవుతాయి.
