అంతర్జాతీయ మ్యాచ్ లలో ఎంత పేలవమైన బ్యాటింగ్ చేసిన జట్టు అయినా  కనీసం రెండంకెల స్కోరు అయినా చేస్తుంది. కానీ నేపాల్ కు చెందిన అండర్-19 మహిళల జట్టు మాత్రం అవి కూడా చేయలేకపోయింది.

అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లు ఆడాలంటే జాతీయ జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్లలో కనీసం ఒక్కరో, ఇద్దరో ఆడినా ఆ జట్టు కనీసం రెండంకెల స్కోరు అయినా చేస్తుంది. కానీ నేపాల్ మహిళల అండర్-19 జట్టు మాత్రం అత్యంత దారుణంగా విఫలమైంది. సింగిల్ డిజిట్ స్కోరుకే చాపచుట్టేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 8 పరుగులకే ఆలౌటైంది. 11 మందిలో అత్యధిక స్కోరు చేసింది స్నేహ మహారా (3) ఒక్కతే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేసి ఆలౌటైన జట్టుగా నేపాల్ నిలించింది. 

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వచ్చే ఏడాది తొలిసారి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ను ప్రారంభించనుంది. దక్షిణాఫ్రికాలో మొదలుకాబోయే ఈ టోర్నీ కోసం అర్హత సాధించే జట్ల కోసం తాజాగా వివిధ దేశాలలో మ్యాచులను నిర్వహిస్తున్నారు. 

Scroll to load tweet…

క్రికెట్ ను మరింత విస్తృతి చేసేందుకు గాను ఐసీసీ.. పలు చిన్న దేశాలను కూడా క్వాలిఫయింగ్ రౌండ్లలో అవకాశం కల్పించింది. ఇదే క్రమంలో మలేషియాలో నేపాల్, యూఏఈ, థాయ్లాండ్, భూటాన్, ఖతర్ వంటి దేశాలు కూడా అర్హత రౌండ్లలో పాల్గొంటున్నాయి. 

Scroll to load tweet…

ఇదే క్రమంలో శనివారం నేపాల్-యూఏఈ మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు.. 8.1 ఓవర్లు ఆడి 8 పరుగులకే ఆలౌట్ అయింది. యూఏఈ బౌలర్లలో మహికా గౌర్.. 4 ఓవర్లు వేసి 2 మెయిడిన్లు విసిరి, 2 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. ఇందుజా నందకుమార్ కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 2.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఐదు వికెట్లు తీసి నేపాల్ వెన్ను విరిచిన మహికా గౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.