Pakistan Vs Australia: ఏదైతే జరగకూడదని పాకిస్థాన్ అభిమానులు కోరుకున్నారో అదే జరిగింది.  నిలకడలేమికి పేటెంట్ హక్కులు తీసుకున్న పాకిస్థాన్ నిర్ణయాత్మక లాహోర్ టెస్టులో బొక్క బోర్లా పడింది. ఫలితంగా సిరీస్ ను కోల్పోయి సర్వత్రా  విమర్శలు మూటగట్టుకుంది. 

సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన కంగారూలు సగర్వంగా సిరీస్ ను సొంతం చేసుకున్నారు. నిర్ణయాత్మక లాహోర్ టెస్టులో ఆస్ట్రేలియానే విజయం వరించింది. అసలు గెలుపు మీద ఆశలే లేని స్థితి నుంచి ఏకంగా టెస్టుతో పాటు సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. పాకిస్థాన్ కు అలవాటైన ‘నిలకడ లేమి’ ఆ జట్టును మరోసారి దెబ్బకొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో శుభారంభం దక్కినా దానిని సద్వినియోగం చేసుకోలేదు. ఐదో రోజు ఆ జట్టు బ్యాటర్లు ఒకరివెనుక ఒకరు వరుస కట్టి పెవిలియన్ కు చేరారు. తొలి ఇన్నింగ్స్ కు రిప్లేనా..? అన్నట్టు ఆడారు. ఫలితంగా ఆస్ట్రేలియా 115 పరగులతో విజయం సాధించింది. సిరీస్ ను 1-0తో కైవసం చేసుకుంది. రావల్పిండి, కరాచీలో జరిగిన రెండు టెస్టులు డ్రా గా ముగిసన విషయం తెలిసిందే. 

లాహోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో 351 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు వికెట్ నష్టపోకుండా 73 పరుగులు. ఆట ఐదో రోజు 278 పరుగులు చేస్తే చారిత్రాత్మక విజయం ఆ జట్టు సొంతమయ్యేదే అనుకున్నారు ఆ జట్టు ఫ్యాన్స్. కానీ అభిమానులు ఆశించినట్టు ఆడితే అది పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎందుకవుతుంది..? 

ఐదో రోజు ఆట ప్రారంభించిన పాక్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కామెరూన్ గ్రీన్.. షఫీక్ ను ఔట్ చేశాడు. గుడ్ లెంగ్త్ డెలివరీ వేసిన గ్రీన్ బంతి షఫీక్ (27) బ్యాట్ కు తాకి కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లో పడింది. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అజర్ అలీ (17) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. పాక్ ఇన్నింగ్స్ 45.2 ఓవర్లో లియాన్ వేసిన బంతికి స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అతడు నిష్క్రమించాడు. ఇక కెప్టెన్ బాబర్ ఆజమ్ (104 బంతుల్లో 55) తో జత కలిసిన ఇమామ్ ఉల్ హక్ (199 బంతుల్లో 70) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. అయితే 61వ ఓవర్లో లియాన్ మరోసారి పాక్ ను దెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్ లో లబూషేన్ కు క్యాచ్ ఇచ్చి ఇమామ్ వెనుదిరిగాడు. అప్పటికీ పాక్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు. 

లియాన్, కమిన్స్ ల దూకుడు.. 

పిచ్ బౌలర్లకు సహకారం అందిస్తుండటంతో ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ పదే పదే బౌలింగ్ ఛేంజ్ చేస్తూ పాక్ ను ముప్పు తిప్పలు పెట్టాడు. స్పిన్నర్ లియాన్ తో పాటు తాను కూడా కీలక స్పెల్ వేశాడు. బాబర్ ఆజమ్ క్రీజులో ఉన్నా.. మిగతా బ్యాటర్ల పని పట్టాడు. 68.4 ఓవర్లో ఫవాద్ ఆలం (11) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న కమిన్స్.. తర్వాత ఓవర్లో ప్రమాదకర బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (0) ను కూడా అదే విధంగా ఔట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో పాక్ మూడు వికెట్లు కోల్పోయింది. 

Scroll to load tweet…

ఇక లోయరార్డర్ బ్యాటర్ సాజిద్ ఖాన్ (21) తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపిన బాబర్ ను లియాన్ బోల్తా కొట్టించాడు. 83.3 ఓవర్లో లియాన్ వేసిన బంతిని స్లిప్స్ లో ఉన్న స్మిత్ కు క్యాచ్ ఇచ్చి బాబర్ క్రీజును వీడాడు. అప్పటికీ స్కోరు 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు. తర్వాత ఓవర్లోనే సాజిద్ ఖాన్ కూడా ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్ కుప్పకూలడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. హసన్ అలీ (13), షాహీన్ అఫ్రిది (5) లను లియాన్ ఔట్ చేయగా.. నజీమ్ షా ను బౌల్డ్ చేసి కమిన్స్ ఆసీస్ కు అపూర్వ విజయాన్ని అందించాడు. నాథన్ లియన్ కు 5 వికెట్లు దక్కగా.. కమిన్స్ కు 3 , స్టార్క్, గ్రీన్ లకు తలో వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా పాట్ కమిన్స్ ఎంపికవగా సిరీస్ ఆసాంతం రాణించిన ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 

1998 తర్వాత పాక్ పర్యటన (ఆ సిరీస్ లో కూడా 1-0తో కంగారూలదే విజయం) కు వచ్చిన ఆసీస్ కు ఈ సిరీస్ లో తొలి విజయం.. తొలి రెండు టెస్టులలో ఫలితం తేలకపోవడంతో లాహోర్ టెస్టు ఇరు జట్లకు కీలకమైంది. అయితే రెండో టెస్టులో అద్భుతమైన పోరాటంతో అందరి ప్రశంసలు అందుకున్న పాక్.. లాహోర్ లో మాత్రం దారుణంగా విఫలమైంది. 

సంక్షిప్త స్కోరు బోర్డు : ఆస్ట్రేలియా - 391, 227-3 డిక్లేర్డ్ 
పాకిస్థాన్ - 268, 235 
ఫలితం : 115 పరుగులతో ఆసీస్ విజయం.. టెస్టు సిరీస్ 1-0తో కైవసం