Asianet News TeluguAsianet News Telugu

Legends League Cricket: నమన్ ఓజా సుడిగాలి ఇన్నింగ్స్.. సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం.. భారీ స్కోరు చేసినా..

Legends League Cricket 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్ లతో భాగంగా ఇండియా మహారాజాస్ తరఫున ఆడుతున్న నమన్ ఓజా.. వీర విధ్వంసం సృష్టించాడు. 69 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో  సుడిగాలి ఇన్నింగ్సు ఆడాడు. కానీ...
 

Naman Ojha Terrific Innings could not help Indian Maharaja's to win over World Giants in Legends Cricket league 2022
Author
Hyderabad, First Published Jan 23, 2022, 1:08 PM IST

యూఏఈ వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్.. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ టోర్నీలను మరిపిస్తున్నది. ఈ లీగ్ లో ఆడుతున్నది వయసు మళ్లిన క్రికెటర్లే అయినా వారిలో దూకుడు మాత్రం తగ్గలేదు. నలభై ఏండ్లు దాటినా.. యువ క్రికెటర్ల మాదిరే చెలరేగిపోతున్నారు. తాజాగా.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లతో భాగంగా ఇండియా మహారాజాస్ తరఫున ఆడుతున్న భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా (38 ఏండ్లు).. వీర విధ్వంసం సృష్టించాడు. 69 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఈ లీగ్ లో ఓజాదే తొలి సెంచరీ. అతడి ఇన్నింగ్స్ లో ఏకంగా 15 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఓజా విధ్వంసం సృష్టించినా.. ఆఖర్లో కెప్టెన్ మహ్మద్ కైఫ్ సంయమనంతో ఆడటంతో భారీ స్కోరు సాధించిన  ఇండియా మహారాజాస్ కు ఓటమి తప్పలేదు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇండియా మహారాజులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ వసీం జాఫర్(0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బద్రీనాథ్ (0) కూడా గత మ్యాచులో మాదిరే  విఫలమయ్యాడు. వరల్డ్ జెయింట్స్ బౌలర్ సైడ్ బాటమ్ ఆ ఇద్దరినీ పెవిలియన్ కు  పంపాడు. 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన కైఫ్ తో  జతకలిసిన ఓజా.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో  సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.

 

ఓజా సుడిగాలి ఇన్నింగ్స్ : 

35 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన  ఓజా.. ఆ తర్వాత  మరింత చెలరేగాడు. హాఫ్ సెంచరీ తర్వాత సెంచరీకి చేరడానికి అతడికి 22 బంతులే అవసరమయ్యాయి.  థర్డ్ మ్యాన్ దిశగా  ఫోర్ కొట్టిన ఓజా.. మరింత రెచ్చిపోయాడు. అతడి ఇన్నింగ్సు (140)లో 114 పరుగులు సిక్సర్లు, ఫోర్ల రూపంలో వచ్చాయంటే ఓజా విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 19.4 ఓవర్లో  మోర్నీ మోర్కెల్ బౌలింగ్ లో అతడు ఇమ్రాన్ తాహీర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కైఫ్ (53) హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా మహారాజాస్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. 

 

తాహీర్ తుఫాన్ : 

భారీ లక్ష్య ఛేదనలో వరల్డ్ జెయింట్స్ తడబడింది. ఆ జట్టు ఓపెనర్ కెవిన్ ఓబ్రయిన్ (9),  జొనాథన్ ట్రాట్ (6 రిటైర్డ్ హర్ట్), కోరే అండర్సన్ (0) లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరారు.  ఓపెనర్ కెవిన్ పీటర్సన్ (53) అర్థసెంచరీ సాధించినా అతడికి తోడుగా నిలిచేవారే కరువయ్యారు. దీంతో ఆ జట్టు 13.4 ఓవర్లలో 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.  అతడు ఎదుర్కున్న 19 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి తన జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు.  తాహీర్ విద్వంసంతో ఓజా ఇన్నింగ్స్ బూడిదలో పోసిన పన్నీరయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios