భారత క్రికెట్ ప్రియులను మరింత ఉర్రూతలూగించేందుకు ఐపిఎల్ 2020 సిద్దమవుతోంది. ఈ ఏడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ అయితే మరో టైటిల్ కోసం ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం  విండీస్ కు చెందిన ఓ ఆల్ రౌండర్ ని జట్టులో చేర్చుకుంది.  

ముంబై ఇండియన్స్- డిల్లీ డేర్ డెవిల్స్ జట్లు పరస్పర అంగీకారంతో ఇద్దరు ఆటగాళ్లను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇలా ముంబై టీం నుండి యువ స్పిన్నర్ మయాంక్ మార్కండే డిల్లీ చెంతకు చేరాడు. అలాగే వెస్టిండిస్ కు చెందిన ఆల్ రౌండర్   షెర్పాన్ రూథర్‌ఫర్డ్ డిల్లీ వదులుకోగా ముంబై ఇండియన్స్ చేజిక్కించుకుంది. రూథర్ పర్డ్ చేరికతో  ముంబై టీం మరింత బలోపేతంగా తయారయ్యిందని ప్రాంఛైజీ యజమాని ఆకాశ్ అంబానీ పేర్కొన్నాడు. 

''మయాంక్ భవిష్యత్ లో కూడా మరింత చక్కటి ప్రదర్శన కొనసాగించాలని కోరుకుంటున్నా. మంచి టాలెంట్ కలిగిన ఆటగాన్ని వదులుకోడం ఇష్టం లేకున్నా ఆ పని చేయాల్సి వస్తోంది. ఈ నిర్ణయం తీసుకోడానికి చాలా ఆలోచించాం. అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతన్ని వదులుకోవడం తప్ప మరో మార్గం  కనిపించలేదు. అయితే అతడిని ఎప్పటికి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ మెంబర్ గానే గుర్తిస్తాం.

ఇక మా ముంబై ఇండియన్స్ ప్యామిలీలోకి   రూథర్‌ఫర్డ్ ని సాదరంగా ఆహ్వానించడానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నా. అతడు తన ఆల్  రౌండ్ ప్రదర్శన ద్వారా ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు అతి తక్కువ  కాలంలోనే గొప్ప క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున కూడా అతడు ఇదే రకమైన ప్రదర్శన కొనసాగిస్తాడని బలంగా నమ్ముతున్నాను.''  అని ఆకాశ్ అంబానీ వెల్లడించాడు.