ఐపిఎల్ 2019 లో ప్లేఆఫ్ బెర్తుకోసం గట్టి పోటీనెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చెన్నై, డిల్లీలు ప్లేఆఫ్ కు చేరుకోగా వాటి సరసన ముంబై  కూడా చేరింది. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన రసవత్తర పోరులో ముంబైదే పైచేయిగా నిలిచింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో మ్యాచ్ టై  అయ్యింది. చివరకు సూపర్ ఓవర్ ద్వారా ఆతిథ్య ముంబై విజయాన్ని అందుకుని ప్లేఆఫ్ కు దూసుకుపోయింది. 

ఈ మ్యాచ్ అనంతంరం రోహిత్  మాట్లాడుతూ...సూపర్ ఓవర్లో బుమ్రాతో ఎందుకు బౌలింగ్ చేయించాడో బయటపెట్టాడు. ''ప్రతి మ్యాచ్‌లో గెలవాలన్న కసితో బుమ్రా బౌలింగ్ చేస్తాడు. ప్రత్యర్థులను తన యార్కర్లతో ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఇక డెత్ ఓవర్లలో అతడె పరుగులను అడ్డుకుంటూ వికెట్లు పడగొట్టే తీరు అద్భుతం. ఒత్తిడిని ఏమాత్రం  దరిచేరనివ్వకుండా ప్రశాంతంగా వుండటంవల్ల అతడు అనుకున్న చోటే బంతిని  వేయగలడు. ఇక తమ జట్టులో ప్రధాన బౌలర్ కూడా అతడే. అందువల్లే బుమ్రాతో సూపర్ ఓవర్ వేయిస్తే మంచి ఫలితం వస్తుందని నమ్మాను. ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకుంటూ అద్భుతంగా కాదు తెలివిగా సూపర్ ఓవర్ ను ముగించాడు.'' అంటూ రోహిత్  బుమ్రాను ప్రశంసించాడు. 

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ముంబై 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేధనలో సన్ రైజర్స్   మొదట్లో కాస్త తడబడ్డా మనీష్ పాండే ఒంటరి పోరాటంతో విజయం వైపు దూసుకుపోయింది. ఈ క్రమంలో చివరి ఓవర్లో  మరింత ఉత్కంఠ నెలకొనగా  పాండే చివరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్ ను టై  చేశాడు. 

ఈ క్రమంలోనే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని రాబట్టారు. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన  సన్ రైజర్స్ బుమ్రా దెబ్బకు విలవిల్లాడిపోయింది. కేవలం నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు  పడగొట్టిన బుమ్రా  కేవలం 8పరుగులను మాత్రమే సమర్పించుకున్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, పొలార్డ్ లు బ్యాటింగ్ కు దిగి కేవలం మూడు బంతుల్లోని లక్ష్యాన్ని చేధించి ముంబైకి మరో అద్భుత విజయాన్ని అందించడంతో పాటు ప్లేఆఫ్ కు చేర్చారు. 

మరిన్ని వార్తలు

రషీద్ ఖాన్ తో సూపర్ ఓవర్ ఎందుకు వేయించానంటే: విలియమ్సన్