బౌలింగ్ కోచ్గా జులన్ గోస్వామి.. ముంబై కోచింగ్ సిబ్బంది వీళ్లే..
WPL 2023: మెన్స్ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ముంబై ఫ్రాంచైజీ (అంబానీ టీమ్)కి కోచింగ్ టీమ్ ను పరిచయం చేసింది.

వచ్చే నెలలో మొదలుకాబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు జట్లన్నీ సన్నాహకాలు మొదలుపెట్టాయి. గత దశాబ్దంలో అంతర్జాతీయ క్రికెట్ లో మెరుపులు మెరిపించిన మాజీ క్రికెటర్లను తమ కోచింగ్ సిబ్బందిగా ఆహ్వానిస్తున్నాయి. ఇదివరకే గుజరాత్ జెయింట్స్ (గౌతం అదానీ టీమ్) కోచింగ్ సిబ్బందిని నియమించుకోగా.. తాజాగా మెన్స్ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ముంబై ఫ్రాంచైజీ (అంబానీ) కి కూడా కోచింగ్ టీమ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ముంబై ఇండియన్స్ ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
ముంబై ఫ్రాంచైజీకి ఇంగ్లాండ్ మాజీ సారథి ఛార్లొట్ ఎడ్వర్డ్స్ హెడ్ కోచ్ గా వ్యవహరించనుంది. టీమిండియాకు సుదీర్ఘకాలం సేవలందించిన జులన్ గోస్వామి.. బౌలింగ్ కోచ్ తో పాటు మెంటార్ గా కూడా నియమితురాలైంది. ఆమెతో పాటు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ దేవిక పల్షికర్ బ్యాటింగ్ కోచ్ గా ఎంపికైంది.
ఎడ్వర్డ్స్.. సుమారు రెండు దశాబ్దాల పాటు ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కు సేవలందించింది. రెండు ప్రపంచకప్ లు గెలిచిన ఇంగ్లాండ్ మహిళల జట్టు లో ఆమె కీలక సభ్యురాలు. రిటైర్మెంట్ తర్వాత ఈమె ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు కోచ్ గా వ్యవహరించింది. కొద్దికాలం క్రితమే ఐసీసీ ఆమెను హాల్ ఆఫ్ ఫేమ్ తో సత్కరించింది.
జులన్ విషయానికొస్తే.. అంతర్జాతీయ మహిళల క్రికెట్ లో అత్యధిక వికెట్ల ఘనత ఆమె పేరిటే ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఆమె ఖాతాలో 350 కి పైగా వికెట్లున్నాయి. గతేడాది ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత జులన్ ఆట నుంచి తప్పుకుంది. ఆ తర్వాత బెంగాల్ వుమెన్స్ టీమ్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్నది.
దేవిక.. గతంలో భారత జట్టుకు ఆల్ రౌండర్ గా సేవలందించింది. ఆమె భారత జట్టుకు 2014 నుంచి 2016 వరకు భారత మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా పనిచేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ టీమ్ కు అసిస్టెంట్ కోచ్ గా నియమితురాలైంది. 2018లో ఆమె హయాంలోనే బంగ్లా టీమ్ ఆసియా కప్ నెగ్గింది.
ఈ లీగ్ లో అదానీ టీమ్ కూడా కోచింగ్ సిబ్బందిని నియమించుకుంది. గుజరాత్ జెయింట్స్ కు హెడ్‌కోచ్ గా ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ రేచల్ హేన్స్ ఎంపికైంది. ఇటీవలే అండర్ - 19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న నూషిన్ అల్ ఖాదిర్ ను బౌలింగ్ కోచ్ గా ఎంచుకుంది. తుషార్ అరోథ్ బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను, గవన్ ట్వినింగ్ పీల్డింగ్ కోచ్ గా వ్యవహరించనున్నారని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.