Sachin Tendulkar: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తనకు ఎంతో ఇష్టమైన వాంఖెడే స్టేడియంలో సచిన్ కు త్వరలోనే మరో అరుదైన గౌరవం దక్కనుంది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. తనకు ఎంతో ఇష్టమైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహం ఆవిష్కృతం కానుంది. రాబోయే ఐపీఎల్ సీజన్ లోనే దీనిని ఆవిష్కరించేందుకు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ఏడాది సచిన్ తన 50వ బర్త్ డే జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా సచిన్ బర్త్ డే అయిన ఏప్రిల్ 24కు ఒక్క రోజు ముందే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) సన్నాహకాలు చేస్తున్నది.
ఈ మేరకు ఎంసీఎ అధ్యక్షుడు అమోల్ కాలే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో మాట్లాడుతూ.. సచిన్ భారత క్రికెట్ కు చేసిన సేవలకు ఇది తాము చేసే చిన్ని సత్కారం అని తెలిపాడు. తన విగ్రహాన్ని వాంఖెడేలో స్థాపించేందుకు అంగీకారం తెలిపినందుకు గాను ఆయన సచిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కాలే స్పందిస్తూ.. ‘వాంఖెడే స్టేడియంలో ఇదే మొదటి విగ్రహం. త్వరలోనే ఇది ఎక్కడ ప్రతిష్టించాలనే విషయమై తుది నిర్ణయం తీసుకుంటాం. సచిన్ భారతరత్న అవార్డు గ్రహీత. దేశానికి, క్రికెట్ కు అతడు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. త్వరలోనే అతడు 50 వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ (ఎంసీఎ) తరఫున సచిన్ కు ఇదో చిరు సత్కారం. దీని గురించి మూడు వారాల క్రితమే సచిన్ తో మాట్లాడి అతడి అంగీకారం తీసుకున్నాకే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని నిశ్చయించాం..’అని చెప్పాడు.
కాగా వాంఖెడేలో ఇప్పటికే సచిన్ పేరిట ఓ స్టాండ్ కూడా ఉంది. ఇప్పుడు విగ్రహం కూడా నెలకొల్పుతుండటంతో వాంఖెడేలో మాస్టర్ బ్లాస్టర్ పేరు చిరస్థాయిగా నిలవబోతుందని అతడి అభిమానులు చెప్పుకుంటున్నారు. భారత క్రికెట్ లో ఇంతవరకు కల్నల్ సీకే నాయుడుది తప్ప మరో క్రికెటర్ కు స్టేడియాల వద్ద విగ్రహాలు ఏర్పాటుచేయడం ఇదే ప్రథమం. సీకే నాయుడు విగ్రహం విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ),వైజాగ్ లోని వీడీసీఏ స్టేడియం, ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వద్ద ఆయన ప్రతిమలున్నాయి.
కాగా తన విగ్రహం ఏర్పాటుచేయడంపై సచిన్ స్పందిస్తూ.. తన కెరీర్ ఇక్కడే ప్రారంభమై వాంఖెడేలోనే ముగిసిందని, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాని చెప్పాడు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులను సచిన్ తన భార్యతో కలిసి పరిశీలించాడు.
