డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ... దుబాయ్ బిజినెస్‌మ్యాన్‌తో కలిసి..
అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ... స్నేహితులతో కలిసి యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ వీక్షించిన మాజీ కెప్టెన్..

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా సమయాన్ని తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికే వెచ్చిస్తున్నాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, తన స్నేహితులతో కలిసి యూఎస్ క్వార్టర్ మ్యాచ్‌ని వీక్షించాడు. ఈ మ్యాచ్ అనంతరం అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు ధోనీ. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు హితేశ్ సంఘ్వీ అనే బిజినెస్‌మ్యాన్.
‘ధోనీ, డొనాల్డ్ ట్రంప్ ఇంకా రాజీవ్ శర్మతో గోల్ఫ్ ఆడుతున్నా.. మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్యూ మిస్టర్ ప్రెసిడెంట్..’ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడు హితేశ్ సంఘ్వీ. ఈ ఫోటోల్లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
దుబాయ్‌లో సెటిలైన భారతీయ వ్యాపారవేత్త హితేశ్ సంఘ్వీ, మహేంద్ర సింగ్ ధోనీకి మంచి స్నేహితుడు. సోషల్ మీడియాలో కూడా మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి దిగిన ఫోటోనే ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు హితేశ్ సంఘ్వీ.
ఐపీఎల్ 2023 సమయంలో చిన్న జట్టుతో కనిపించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఇప్పుడు మళ్లీ హెయిర్ స్టైల్ మార్చారు. కెరీర్ ఆరంభంలో ఉన్నట్టుగా జులపాల జట్టుతో గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు మాహీ. ఐపీఎల్ 2023 సీజన్‌లో మోకాలి గాయంతో బాధపడిన ఎమ్మెస్ ధోనీ, సర్జరీ కూడా చేయించుకున్నాడు. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడని ఆయన సతీమణి సాక్షి సింగ్ ప్రకటించింది..
క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత కపిల్ దేవ్, ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్‌గా మారాడు. యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ కూడా గోల్ఫ్ ఆటపై ఆసక్తి చూపిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ కూడా గోల్ఫ్ ప్లేయర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
లాక్‌డౌన్ సమయంలో సేంద్రీయ వ్యవసాయంపై ఫోకస్ పెట్టిన ధోనీ, రాంఛీలో తన 40 ఎకరాల ఫామ్ హౌజ్‌లో రకరకాల పంటలు పండిస్తున్నాడు. ధోనీ పండించిన పంటలను దేశవ్యాప్తంగా విక్రయించడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. స్టాబెర్రీ, క్యారెట్ వంటి పంటలే కాకుండా పాలు, పాల ఉత్పత్తులను కూడా సరఫరా చేస్తున్న ధోనీ.. కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం కూడా మొదలెట్టాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడతాడా? లేదా? అనే విషయం డిసెంబర్‌లో జరిగే వేలంలో తేలిపోనుంది. ఒకవేళ ధోనీ, ఐపీఎల్ 2024 సీజన్ ఆడకూడదని అనుకుంటే, చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆసియా క్రీడలు 2023 పోటీల్లో భారత పురుషుల జట్టుకి కెప్టెన్సీ చేయబోతున్న రుతురాజ్ గైక్వాడ్, అక్కడ విజయం సాధిస్తే.. మాహీ వారసుడిగా సీఎస్‌కే కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడు.