టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కు రూ.1800 బకాయి పడ్డాడు. ఝార్ఖండ్ నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్ ధోనీనే. దీంతో జేఎస్‌సీఏ గతేడాది ధోనీకి జీవితకాల సభ్యత్వం ఇచ్చింది.

అయితే, ఇందుకు గాను చెల్లించాల్సిన రూ. 1800 ఫీజును ధోనీ ఇప్పటి వరకు చెల్లించలేదని జేఎస్‌సీఏ పేర్కొంది. అసోసియేషన్ ప్రకటనతో ఒక్కసారిగా జంషెడ్‌పూర్‌లో గందరగోళం చెలరేగగా ఆ తర్వాత అది క్రమంగా వివాదం వైపు మళ్లింది.

మాజీ క్రికెటర్, సామాజిక కార్యకర్త అయిన శేష్‌నాథ్ పాఠక్ సారథ్యంలోని కొంతమంది విద్యార్థులు, ధోనీ అభిమానులు చందాలు వేసుకోవడం వివాదానికి ఆజ్యం పోసినట్టు అయింది. సేకరించిన సొమ్మును డ్రాఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించగా అసోసియేషన్ అంగీకరించలేదు. కొంతమంది ఆదేశాలతోనే జేఎస్‌సీఏ తామిచ్చిన డ్రాఫ్ట్‌ను తీసుకోవడానికి నిరాకరించిందని, డ్రాఫ్ట్‌ను పోస్టు ద్వారా పంపాలని సూచించారని పాఠక్ తెలిపారు. 

అసోసియేషన్‌కు ధోనీ బాకీపడినట్టు మీడియా ద్వారా తెలిసిందని, అందుకనే తమవంతుగా ఆ సొమ్ము సేకరించాలని నిర్ణయించుకున్నామని పాఠక్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు కూడా కొంత మొత్తాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ధోనీ‌కి తమ వంతుగా చేసిన అతి చిన్న సాయమని ఎక్స్ క్రికెటర్స్ అసోసియేషన్ ఆఫ్ జంషెడ్‌పూర్ కన్వీనర్ కూడా అయిన శేష్‌నాథ్ పాఠక్ వివరించారు. 

ఈ సందర్భంగా జేఎస్‌సీఏ కార్యదర్శి సంజయ్ సహాయ్ మాట్లాడుతూ.. ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చని, అది వారిష్టంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అయితే, డబ్బులు కానీ, ఫీజు కానీ మరేదైనా ఇతరుల పేరుపై చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరని పేర్కొన్నారు. బకాయి సొమ్ము చెల్లించమని ధోనీ కనుక వీరికి చెప్పి ఉంటే తన ఆమోదంతో పనిలేదన్నారు. ధోనీ రుణపడిన సొమ్మును చెల్లించేందుకు ధోనీ నుంచి వీరికి ఎటువంటి అనుమతి లేదని, అందుకనే ఆ డ్రాఫ్ట్‌ను తీసుకునేందుకు నిరాకరించినట్టు చెప్పారు.