టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ముద్దుల కూతురు జీవా సోషల్ మీడియాలో తండ్రి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ చిన్నారి ఆటలు, పాటలు, డ్యాన్సులను ధోని, సాక్షిలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

ఇంట్లో అల్లరి చేసే జీవా మైదానంలో తన తండ్రి ధోనికి మద్ధతుగా నిలిచింది. ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం రాత్రి చెన్నై సైపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. చెన్నై ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

టార్గెట్ చిన్నదిగా కనిపించినా సూపర్‌ కింగ్స్‌కి విజయం కోసం చెమట చిందించాల్సి వచ్చింది. తొలి ఓవర్‌లోనే రాయుడు ఔటవ్వడంతో చెన్నైకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే వాట్సన్ , రైనా ధాటిగా ఆడటంతో సూపర్‌కింగ్స్ లక్ష్యం దిశగా సాగింది.

అయితే వాట్సన్, రైనా వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో ధోనీ సేన కష్టాల్లో పడింది. కెప్టెన్ ధోనీ, జాదవ్ క్రీజులోనే ఉన్నప్పటికీ వారు ధాటిగా ఆడలేకపోవడంతో స్కోరు వేగం తగ్గిపోయింది.

అటు ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైపోయింది. ఈ క్రమంలో ధోని ఓ ఫోర్, సిక్సర్ కొట్టడంతో చెన్నై కాస్త ఊపిరి ల్చుకుంది. అయితే చివరి ఓవర్‌కు రెండు పరుగులు చేయాల్సిన సమయంలో రబాడా వ్యూహాత్మంగా బౌలింగ్ వేశాడు.

జాదవ్‌ను ఔట్ చేసి తర్వాతి రెండు బంతులకు పరుగులు ఇవ్వకపోవడంతో చెన్నై ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఆయన కుమార్తె జీవా ‘‘ గో పప్పా’’ ‘‘కమాన్ పప్పా’’ అంటూ చీర్ గర్ల్‌లా మారి తండ్రిని ఉత్సాహ పరిచింది.

ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ సోషల్ మీడియాలో పెట్టింది. ఈ చిన్నారి తన చిట్టి చేతులతో ముద్దు ముద్దు మాటలతో ‘‘కమాన్ పప్పా’’ అంటుండటంతో అభిమానులు ఫిదా అయిపోయారు.