తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకి ఆలౌట్ అయిన వెస్టిండీస్.. భారత జట్టుకి 183 పరుగుల ఆధిక్యం.. 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్.. 

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు ఎట్టకేలకు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వగలిగారు. స్లో పిచ్‌ కారణంగా మూడో రోజు వికెట్లు తీయడానికి తెగ కష్టపడిన భారత బౌలర్లు, రోజంతా బౌలింగ్ చేసినా 4 వికెట్లు మాత్రమే తీయగలిగారు. అయితే నాలుగో రోజు మొదటి గంటలోనే 5 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు, వెస్టిండీస్‌ని తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకి ఆలౌట్ చేయగలిగారు.. దీంతో భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.. 

నాలుగో రోజు 8.4 ఓవర్లు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, 29 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 229/5 వద్ద బ్యాటింగ్ మొదలెట్టిన వెస్టిండీస్, వర్షం కారణంగా కోల్పోయిన ఓవర్లను కవర్ చేసేందుకు నాలుగో రోజు అరగంట ముందుగానే బ్యాటింగ్ మొదలెట్టింది. మొదటి ఓవర్‌లోనే అలిక్ అతనజే వికెట్ తీసి టీమిండియాకి బ్రేక్ అందించాడు ముకేశ్ కుమార్... 

115 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసిన అతనజే, ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో జాసన్ హోల్డర్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. 44 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన జాసన్ హోల్డర్, ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాత 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన అల్జెరీ జోషఫ్‌ని మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది. త13 బంతుల్లో 4 పరుగులు చేసిన కీమర్ రోచ్ కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాతి బంతికే గ్యాబ్రియల్‌ని గోల్డెన్ డకౌట్ చేసిన మహ్మద్ సిరాజ్.. టెస్టు కెరీర్‌లో రెండోసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్.. నేటి మ్యాచ్‌లో 23.4 ఓవర్లు బౌలింగ్ చేసి 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ టెస్టు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

ముకేశ్ కుమార్‌కి 2 వికెట్లు దక్కగా రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్‌కి ఓ వికెట్ దక్కగా తొలి టెస్టులో వికెట్ తీయలేకపోయిన జయ్‌దేవ్ ఉనద్కట్, రెండో టెస్టులోనూ వికెట్ తీయలేకపోయాడు. 

వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ్రాత్‌వైట్ 75, చంద్రపాల్ 33, కిర్క్ మెక్‌కెంజీ 32, బ్లాక్‌వుడ్ 20, జోషువా డి సిల్వ 10 పరుగులు చేశారు. వీరి బ్యాటింగ్ పర్ఫామెన్స్ కారణంగా ఫాలోఆన్ నుంచి తప్పించుకుంది వెస్టిండీస్. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కి రానుంది. 

ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో టీమిండియా ఈ రోజు బ్యాటింగ్ చేసి... చివరి సెషన్‌లో 4-5 ఓవర్లు మిగిలి ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. వేగంగా బ్యాటింగ్ చేసి, వెస్టిండీస్‌కి 300+ పరుగుల టార్గెట్ ఇచ్చేందుకు భారత జట్టు ప్రయత్నించవచ్చు..