జస్ప్రిత్ బుమ్రా ప్లేస్‌లో మహ్మద్ షమీ... షమీ ప్లేస్‌లోకి మహ్మద్ సిరాజ్, దీపక్ చాహార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్...
టీ20 వరల్డ్ కప్ 2022కి ప్రకటించిన జట్టులో ఉన్న జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. బుమ్రా ఆడడం లేదని తెలిసినా అతని స్థానంలో ఏ బౌలర్‌ని ఎంపిక చేస్తారనే విషయంలో ఉత్కంఠ రేగింది. రోజులు గడుస్తున్నా, గడువు దగ్గర పడుతున్నా బుమ్రాకి రిప్లేస్‌మెంట్ ఎవరనేది ప్రకటించలేదు బీసీసీఐ...
ఎట్టకేలకు క్వాలిఫైయర్ రౌండ్‌కి రెండు రోజుల ముందు బుమ్రా ప్లేస్‌లో మహ్మద్ షమీ ఆడబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు. షమీతో పాటు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ రిజర్వు ప్లేయర్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఆస్ట్రేలియా చేరుకోబోతున్నారు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు మహ్మద్ షమీ. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన మహ్మద్ షమీ, 18 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కి మహ్మద్ షమీని ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే కరోనా బారిన పడడంతో మహ్మద్ షమీ ఆ సిరీస్‌లో ఆడలేకపోయాడు.
ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా సిరీస్‌లోనూ మహ్మద్ షమీ అందుబాటులో లేడు. దీంతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత నేరుగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ ఆడబోతున్నాడు మహ్మద్ షమీ...
ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని కెఎల్ రాహుల్‌ని నేరుగా ఆసియా కప్ 2022 టోర్నీలో బరిలో దింపింది టీమిండియా. రాహుల్‌కి ఉన్న అనుభవం కారణంగా అతనికి ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది. అయితే ఆసియా కప్‌లో కీలక మ్యాచుల్లో ఫెయిల్ అయిన కెఎల్ రాహుల్, టీమిండియా సూపర్ 4 నుంచి నిష్కమించడంలో ఓ కారణంగా మారాడు.
మహ్మద్ షమీ విషయంలో ఇలా జరగకూడదని ఆశిస్తున్నారు టీమిండియా అభిమానులు. మహ్మద్ షమీకి ఆస్ట్రేలియా పిచ్‌ల మీద ఆడిన అనుభవం ఉంది. అంతేకాకుండా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్లేస్‌ని రిప్లేస్ చేయాలంటే అపారమైన అనుభవం ఉన్న మహ్మద్ షమీనే కరెక్ట్ అనే వాదన వినబడింది. దీంతో అతనికి అవకాశం కల్పించారు సెలక్టర్లు...
రిజర్వు ప్లేయర్‌గా మహ్మద్ షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్‌ని స్టాండ్ బై ప్లేయర్‌గా తీసుకోగా గాయపడి టోర్నీకి దూరమైన దీపక్ చాహార్ ప్లేస్‌లో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్. ఈ ఇద్దరూ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. మహ్మద్ షమీ కూడా ఆస్ట్రేలియాకి వెళ్లినట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
