ఐపీఎల్ 2020 ప్రారంభమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. సోమవారం  జరిగిన మ్యాచ్ లో.. ఆర్సీబీ విజయం సాధించింది. కాగా.. తొలి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ ఓటమి పాలయ్యింది. కాగా..  అసలు ఓటమిలో ఉన్న సన్ రైజర్స్ టీమ్ కి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డ ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సీజన్ మోత్తానికి దూరమయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ సీజన్‌లో అతను మళ్లీ ఆడటం కష్టమేనని జట్టు వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్ వేయడానికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ నుంచి బంతిని అందుకున్న మిచెల్ మార్ష్ గాయం కారణంగా నాలుగు బంతుల్లోనే మైదానం వీడాడు. అతను వేసిన రెండో బంతిని ఆర్‌సీబీ ఓపెనర్ స్ట్రయిట్ డ్రైవ్ ఆడగా.. దాన్ని ఆపే క్రమంలో మార్ష్ మడమ ట్విస్ట్ అయింది. నొప్పితో విలవిలలాడిన మార్ష్‌కు ఫిజియో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మరో రెండు బంతులేసిన మార్ష్‌‌కు నొప్పి మరింత ఎక్కువ కావడంతో మైదానం వీడాడు. కాగా..  కేవలం ఆ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు.. మిచెల్ మార్ష్ కంప్లీట్ గా ఈ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. 

‘చూస్తుంటే గాయం చాలా  తీవ్రంగా అనిపిస్తోంది. అతను మిగితా మ్యాచుల్లో ఆడగలడని అనుకోవడం లేదు’ అని జట్టు వర్గాలు పీటీఐకి తెలిపాయి. మార్ష్ గాయంపై జ్టటు యాజమాన్యం మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. కాగా.. అతను దూరమవ్వడం సన్ రైజర్స్ కి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు.

‘దురదృష్టవశాత్తు ఇలా జరగడం బాధాకరం. అతడి పరిస్థితి బాలేదు. నొప్పిని భరిస్తూనే మార్ష్ మళ్లీ దిగి పోరాడటం గొప్ప విషయం. నిజానికి కాలి మడమపై అంత బరువు వేయొద్దు’ అని వార్నర్ కూడా పేర్కొన్నాడు.