వెస్టిండిస్ తో  ముగిసిన టీ20 సీరిస్ లో టీమిండియా జోరు కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ విండీస్ పై పైచేయి సాధిస్తూ కోహ్లీసేన ఈ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో భారత జట్టుపై మరీ ముఖ్యంగా ఈ సీరిస్ లో ఆకట్టుకున్న యువ క్రికెటర్లపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి విన్నింగ్ మూవ్ మెంట్స్ లో సహచరులను ఇంటర్వ్యూ చేయడం యజువేందర్ చాహల్ కు అలవాటు. కానీ అతడు ఈ టీ20 సీరిస్ కు ఎంపిక కాలేదు. ఇలా చాహల్ లేని లోటును రోహిత్ శర్మ తీర్చాడు. 

గయానాలో జరిగిన చివరి టీ20లో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ ని రోహిత్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ వీడియోను బిసిసిఐ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ పై చాహల్ సరదాగా స్పందించాడు. 

''బిసిసిఐ  నన్ను చాలా మిస్సవుతున్నట్లుంది.'' అంటూ బిసిసిఐ ట్వీట్ కు చాహల్ రీట్వీట్ చేశాడు. అతడు చాహల్ టీవి పేరుతో సహచర ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఈ వీడియోలనే బిసిసిఐ వాడుకునేది. అందువల్లే చాహల్ తనను మిస్సవుతున్నట్లుంది అంటూ సరదాగా కామెంట్ చేశాడు. 

ఇక టీ20 సీరిస్ ఆడకున్నా చాహల్ ఇవాళ్టి(గురువారం) నుండి జరిగే వన్డే సీరిస్ లో పాల్గొననున్నాడు. అతడు విండీస్ తో జరిగే మూడు వన్డే సీరిస్ కోసం ఎంపికయ్యాడు. కాబట్టి వన్డే సీరిస్ లో బిసిసిఐ చాహల్ ని మిస్సవదన్నమాట. 

గయానా వేదికన జరిగిన చివరి టీ20 లో కెప్టెన్ కోహ్లీతో కలిసి రిషబ్ పంత్ అదరగొట్టాడు. లక్ష్యఛేదనలో టీమిండియా కేవలం 27పరుగులకే ఓపెనర్లిద్దరికి కోల్పోయి క్లిష్ట సమయంలో వున్నపుడు కోహ్లీ(59 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి రిషబ్ పంత్(65 పరుగులు, 4 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో,  నాటౌట్) తోడవడంతో భారత్ మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.  ఇలా మ్యాచ్ విన్నింగ్ ఆడిన పంత్ ను రోహిత్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.