బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ... రోహిత్ బ్యాటింగ్ నుంచి ఆసీస్ బ్యాటర్లు పాఠాలు నేర్చుకోవాలంటున్న మైకేల్ హస్సీ...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ట్రోఫీలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 32, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసి సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు...
తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాని చిత్తు చేసిన భారత జట్టు, 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచి, సిరీస్‌ని 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది టీమిండియా. రోహిత్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ...
‘రోహిత్ శర్మ బ్యాటింగ్ నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్లు రెండాకులు తీసుకున్నా, టీమిండియాపై ఆధిక్యం సాధించవచ్చు. స్పిన్ బౌలింగ్‌ని ఎలా ఎదుర్కోవాలో రోహిత్ బ్యాటింగ్ చూస్తే క్లియర్‌గా అర్థం అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పరుగులు చేయడమెలాగో రోహిత్‌కి బాగా తెలుసు...
అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసినట్టు చేయడం అంత తేలికైన విషయం కాదు. అది అతనికి వెన్నతో పెట్టిన విద్య. మిగిలిన వాళ్లు అలా బ్యాటింగ్ చేయాలని చూస్తే అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. నేను మాథ్యూ హేడెన్‌లా బ్యాటింగ్ చేయలేదు...
అయితే హేడెన్ కూడా నాలా బ్యాటింగ్ చేయలేడు. అయితే పరిస్థితులు అనుకూలించనప్పుడు బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవడానికి టెక్నిక్ కాపీ చేయడంలో తప్పు లేదు. ఓ బ్యాటర్ బౌండరీలు బాదుతూ అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తుంటే మరో ఎండ్‌లో బ్యాటర్ యాంకర్ రోల్ పోషించాలి...
ప్రతీ ఒక్క బ్యాట్స్‌మెన్‌కి బలం, వీక్‌నెస్ రెండూ ఉంటాయి. బలాన్ని వాడుకుంటూ వీక్‌నెస్‌పై పైచేయి సాధించడానికి ప్రయత్నించాలి. అందరూ ఒకే షాట్ ఆడాలని ప్రయత్నించి అవుట్ అవ్వడం మూర్ఖత్వం. ఎవరి ఫెవరెట్ షాట్‌ని వాళ్లు ఎంచుకుంటే ఫలితం బాగుంటుంది...
స్పిన్ బౌలింగ్‌ని ఎదుర్కోవడానికి స్పీప్ షాట్ ఒక్కటే ఉత్తమ మార్గం అని అనుకుంటే అది పొరపాటే. భారత జట్టు బలం స్పిన్. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్. ఇండియాలో గెలవాలంటే స్పిన్ బౌలింగ్ ఒక్కటే మార్గమని అనుకోవడం కరెక్ట్ కాదు...
బౌలర్లను నమ్మి ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇచ్చి చూడాలి. ప్రత్యర్థి బలాన్ని, మన బలంగా మార్చుకోవడం కంటే మన బలాన్ని వాడుకుని, ప్రత్యర్థిపై దాడి చేయడం సరైన పద్ధతి... ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ చక్కగా బ్యాటింగ్ చేశారు...
అదే రెండో ఇన్నింగ్స్‌లో కూడా వీళ్లిద్దరి బ్యాటింగ్ అలా ఉండి ఉంటే ఆస్ట్రేలియా గెలిచి ఉండేది. అయితే రెండో టెస్టులో కాస్త కంగారు పడ్డట్టు కనిపించారు. ట్రావిస్ హెడ్ తనకి దక్కిన ఆరంభాన్ని కరెక్టుగా వాడుకుని, భారీ స్కోరు చేసి ఉంటే ఈపాటికి సిరీస్ 1-1 తేడాతో సమం అయ్యి ఉండేది. వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకోవడం చాలా అవసరం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీసీ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ..
