Asianet News TeluguAsianet News Telugu

ఐసీసీ అవార్డు రేసులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్..!

స్వదేశంలో న్యూజిలాండ్‌పై, విదేశీ గడ్డ మీద దక్షిణాఫ్రికాపై అద్బుత ప్రదర్శన చేసిన మయాంక్‌ అగర్వాల్‌ ఐసీసీ డిసెంబర్‌ నెలకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.

Mayank Agarwal in the race for ICC player of the month award
Author
Hyderabad, First Published Jan 9, 2022, 7:01 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత జట్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై, విదేశీ గడ్డ మీద దక్షిణాఫ్రికాపై అద్బుత ప్రదర్శన చేసిన మయాంక్‌ అగర్వాల్‌ ఐసీసీ డిసెంబర్‌ నెలకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. డిసెంబర్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 69 సగటుతో 276 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు, ఓ శతకం ఉన్నాయి. న్యూజిలాండ్‌పై ముంబయి టెస్టు విజయంలో మయాంక్‌ అగర్వాల్‌ది ముఖ్య పాత్ర. వరుసగా 150, 62 పరుగుల మెగా ఇన్నింగ్స్‌లతో మయాంక్‌ విమర్శకులను మెప్పించాడు. 

దక్షిణాఫ్రికాపై సెంచూరియన్‌ టెస్టులోనూ మయాంక్‌ అదరగొట్టాడు. కెఎల్‌ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి చారిత్రక విజయానికి గట్టి పునాది వేశాడు. రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, కెఎల్‌ రాహుల్‌ లేని సమయంలో మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనర్‌గా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. 

న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌, ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌లు సైతం మయాంక్‌ అగర్వాల్‌ తోడుగా ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.మరోపక్క టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడు టెస్టెు మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే రెండు జట్లు తలో విజయాన్ని అందుకున్నాయి. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరిదైన మూడో టెస్టు.. ఈ నెల 11 నుంచి కేప్ టౌన్ వేదికగా జరుగనున్నది. 

రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ భారత  టెస్టు సారథి విరాట్ కోహ్లి.. కేప్ టౌన్ టెస్టులో  ఆడతాడని ఊహాగానాలు వినపడుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలు కూడా  ఇందుకు ఊతమిస్తున్నాయి. విరాట్ కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో రెండో టెస్టులో ఆడే అవకాశం దక్కించుకున్న తెలుగు కుర్రాడు హనుమా విహారికి మరోసారి నిరాశే ఎదురుకానుంది. కోహ్లి తిరిగివస్తే విహారి మళ్లీ బెంచ్ కే పరిమితమవుతాడు.   

రాక రాక వచ్చిన అవకాశాన్ని విహారి చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.  రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్పులో మాత్రం 84 బంతుల్లో 40 పరుగులు చేసి భారత్ విలువైన ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత చేసినా అతడికి ఎప్పటి మాదిరే టీమిండియా యాజమాన్యం మొండి చేయి చూపించనుంది.  

గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా విహారిపై టీమ్ మేనేజ్మెంట్ ఇలాగే వ్యవహరించింది.  దీనిపై ఆకాశ్ చోప్రా, గౌతం గంభీర్ వంటి క్రికెటర్లు బహిరంగంగానే బీసీసీఐ విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా  మళ్లీ అదే సీన్ రిపీట్ కాబోతుండటం గమనార్హం.   

విహారి విషయం పక్కనపెడితే.. రెండో టెస్టులో టీమిండియాను కలవరపెట్టిన మరో  అంశం రిషభ్ పంత్ ఫామ్. మిడిలార్డర్ లో కీలకంగా ఆడాల్సిన బాధ్యత తన  మీద ఉన్న పంత్ మాత్రం చెత్త షాట్లతో వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ సిరీస్ లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు.  వరుసగా రెండు టెస్టులు, నాలుగు ఇన్నింగ్సులలో కలిపి రెండంకెల స్కోరు కూడా దాటలేదు. 

ఇక రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో ఉండగా.. రిషభ్ మాత్రం క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడటంపై గవాస్కర్, గంభీర్ వంటి సీనియర్ ఆటగాళ్లు  అతడిపై పదునైన విమర్శలు చేశారు.   ఈ నేపథ్యంలో  కేప్ టౌన్ టెస్టులో అతడిని తప్పించి వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కు ఛాన్స్ ఇవ్వాలని వాదనలు వినిపించాయి. 

ఇక ఈ విషయంపై   రాహుల్ ద్రావిడ్, సారథి విరాట్ కోహ్లి కూడా ఇదే అభిప్రాయంతోని ఉన్నారని సమాచారం. ఇక రెండో టెస్టులో గాయపడ్డ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా కేప్ టౌన్ లో ఆడేది అనుమానమే అని తెలుస్తున్నది. అతడు వంద శాతం ఫిట్ గా లేడన్నది ద్రావిడ్ మాట. ఒకవేళ మూడో టెస్టు సమయానికి అతడు ఫిట్ గా లేకుంటే  ఉమేశ్ యాదవ్ గానీ, ఇషాంత్ శర్మ గానీ ఆ మ్యాచ్ ఆడే అవకాశముంది. 

Follow Us:
Download App:
  • android
  • ios