కిందపడిపోయిన ఛూయింగ్ గమ్‌ని తిరిగి నోట్లో వేసుకున్న మార్నస్ లబుషేన్... లార్డ్స్ టెస్టులో ఆసీస్ బ్యాటర్ చేసిన పనికి...
ప్రతీ మనిషికి మంచివో చెడ్డవో కొన్ని ఆహార అలవాట్లు ఉంటాయి. ప్రాణం మీద ఉన్న తీపితో సాధ్యమైనంతలో కాస్త ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలని అనుకుంటారు. క్రికెటర్లకు ఇది చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు అయితే డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. అయితే ఆసీస్ టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్, లార్డ్స్ టెస్టులో చేసిన ఓ పని... అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది..
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో మొట్టమొదటిసారిగా గోల్డెన్ డకౌట్ అయిన మార్నస్ లబుషేన్, ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకుని కూడా కోల్పోయాడు. రెండో టెస్టులో 93 బంతుల్లో 7 ఫోర్లతో 47 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
అయితే ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో లబుషేన్ తన గ్లవ్స్ సరి చేసుకుంటుండగా, నోట్లో ఉన్న ఛూయింగ్ గమ్ జారి కిందపడిపోయింది. సాధారణంగా భారతదేశంలో అయితే చాలామంది కింద పడిపోయిన ఆహారాన్ని తిరిగి తీసుకుని తినడానికే ఇష్టపడరు..
అదే మట్టి మీద పడితే దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. అదీ నోట్లో పెట్టుకుని నమిలి నమిలి లాలజలంతో నింపేసిన బబుల్ గమ్ కిందపడితే... తిరిగి దాన్ని ముట్టుకోవడానికి కూడా చెండాలంగా ఫీల్ అవుతారు. అయితే మార్నస్ లబుషేన్ మాత్రం కింద పడిన ఛూయింగ్ గమ్‌ని తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు..
ఈ సంఘటన కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో ఈ #ChewingGum ట్రెండింగ్‌లో నిలిచింది. ఆసీస్ క్రికెటర్ అయ్యుండి ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా అలా కిందపడిన ఛూయింగ్ గమ్‌ని తిరిగి నోట్లో వేసుకున్న లబుషేన్‌ని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్..
డేవిడ్ వార్నర్ 66, ఉస్మాన్ ఖవాజా 17, మార్నస్ లబుషేన్ 47 పరుగులు చేసి అవుట్ కాగా ట్రావిస్ హెడ్ 73 బంతుల్లో 14 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. బీభత్సమైన ఫామ్‌ని కొనసాగిస్తున్న స్టీవ్ స్మిత్, 184 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి... టెస్టుల్లో 31వ సెంచరీని అందుకున్నాడు..
కామెరూన్ గ్రీన్ డకౌట్ కాగా అలెక్స్ క్యారీ 22 పరుగులు, ప్యాట్ కమ్మిన్స్ 22 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా.
68 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసిన ఇంగ్లాండ్, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోరుకి ఇంకా 122 పరుగులు వెనకబడి ఉంది. బెన్ డక్లెట్ 98 పరుగులు చేసి సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ కాగా హారీ బ్రూక్ 50 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టోతో పాటు స్టువర్ట్ బ్రాడ్ క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరూ చేసే పరుగులను బట్టి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది.
