టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించి.. ప్రపంచంలోని అత్యుత్త కెప్టెన్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ధోనీ ఓ పాకిస్తాన్ క్రికెటర్ డేటింగ్ రద్దుకు కారణమయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. ధోనీ 2005లో టీమిండియాకు ఎంపిక కావడానికి ముందుకు ఇండియా ఎ జట్టులో ఆడేవాడు. అప్పుడు  కెన్యాలో పాకిస్తాన్ -ఏ, భారత్ - ఏ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్‌లో రెచ్చిపోయి ఆడి 360 పరుగులు చేశాడు. దాంతో సెలక్టర్ల దృష్టిలో పడి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అయితే ఆ సిరీస్‌లోనే పాకిస్తాన్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. ఆ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న ఓ పాకిస్తాన్ క్రికెటర్... ఆ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఓ భారతీయ యువతిని పరిచయం చేసుకున్నాడు.

మ్యాచ్ అయ్యాకా ఇద్దరు కలిసి రెస్టారెంట్‌కు కూడా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ధోని కొట్టిన  ఓ భారీ సిక్సర్ నేరుగా ఆమెకు తగిలింది. దీంతో గాయపడిన ఆమె ఆసుపత్రి పాలైంది. చివరికి ఆ పాక్ క్రికెటర్ ఆశలు ఆడియాశలయ్యాయి.

ఇది ధోనీ కావాలని చేయకపోయినా.. అనుకోకుండా ఆ యువతికే బంతి తగలడం యాధృచ్చికం. ఈ సిరీస్ తర్వాత భారత జట్టుకు ఎంపికైన మహీ... 2007 నుంచి 2017 వరకు సారథిగా కొనసాగడమే కాకుండా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.