కాఫీ విత్ కరణ్ షో వివాదం తర్వాత టీమిండియా యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ లకు మొదటిసారి కలిసి ఆడే అవకాశం వచ్చింది. ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో వీరిద్దరు కలిసి ఆడనున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో అద్భుత సెంచరీతో అదరగొట్టిన రాహుల్ తుది జట్టులో బెర్తు దాదాపు ఖాయం  చేసుకున్నాడు. భారత్ కు సమస్యగా  మారిన నాలుగో స్థానంలో అతన్ని బరిలోకి దించాలని కెప్టెన్ కోహ్లీతో పాటు  టీం మేనేజ్ మెంట్ యోచిస్తోంది. అదే జరిగితే రాహుల్, పాండ్యాలు కలిసి భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. 

అయితే కాఫీ విత్ కరణ్  షో వివాదం కారణంగా పాండ్యా, రాహుల్ ల మధ్య కాస్త దూరం పెరిగింది. వారిద్దరి మధ్య గతంలో వున్న సాన్నిహిత్యం ఆ వివాదం తర్వాత కనిపించలేదు. కనీసం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రపంచ కప్ టోర్నీ వీరిద్దరి మధ్య దూరాన్ని తగ్గించింది.

ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు విజయావకాశాల గురించి రాహుల్ మాట్లాడుతూ సహచన ఆటగాడు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై జరిగే ప్రపంచ కప్ లో ఆల్ రౌండర్ హార్దిక్ అద్భుతాలు సృష్టించనున్నాడని జోస్యం చెప్పాడు. జట్టు కూర్పులో అతడెంతో కీలక పాత్ర పోషించనున్నాడని...అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ విభాగాల్లోనూ రాణించే సత్తా పాండ్యాకు వుందన్నాడు. 

''పాండ్యా మంచి నైపుణ్యం గల ఆటగాడు. ఎలాంటి బాధ్యత అప్పగించినా సాదరంగా స్వీకరిస్తాడు. ఈ ప్రపంచ కప్ జట్టులో అతడు కీలక ఆటగాడిగా మారనున్నాడు. పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శన  ఇంగ్లాండ్ పిచ్ లపై చాలా ఉపయోగపడుతుంది.'' అంటూ పాండ్యాను రాహుల్ కొనియాడాడు.