వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్ జట్టు సారధిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో జరిగిన సిరీస్‌లో విండీస్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టు కెప్టెన్లను మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం వన్డేలకు జేసన్ హోల్డర్, టెస్టులకు బ్రాత్ వైట్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరిద్దరినీ తప్పించి.. వన్డే, టీ20లకు పొలార్డ్‌ను సారథిగా నియమించాలని బోర్డు భావిస్తోంది.

శనివారం జరిగిన విండీస్ క్రికెట్ బోర్డు సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదించగా.. బోర్డు డైరెక్టర్లలో ఆరుగురు పొలార్డ్‌కు మద్ధతునివ్వగా.. ఆరుగురు మాత్రం స్పందించలేదు. పొలార్డ్ తన ఆఖరి వన్డేను 2016లో ఆడాడు. ప్రపంచకప్‌కు సైతం అతడిని ఎంపిక చేయలేదు.

అయితే భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు మాత్రం సెలక్టర్లు స్థానం కల్పించారు. పొలార్డ్ విండీస్ తరపున ఇప్పటి వరకు 101 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. వన్డేల్లో 25.71 సగటుతో 2,289 పరుగులు చేసి 50 వికెట్లు పడగొట్టాడు. టీ20లలో 23 వికెట్లతో పాటు 903 పరుగులు చేశాడు.