కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా 8వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని లక్షల మంది వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదని ప్రముఖులు చెబుతున్నారు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా చేరాడు.


ఇండియాలోని అభిమానులను ఉద్దేశించి మనసుకు హత్తకుపోయేలా హిందీలో ట్వీట్ చేశాడు. కరోనా మహమ్మారి అంతం చూసేందుకు మనందరం ఒక్కటయ్యామని పేర్కొన్న పీటర్సన్..  ప్రభుత్వ సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని విజ్ఞప్తి చేశాడు. కొన్ని రోజులపాటు అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించాడు.

‘‘నమస్తే ఇండియా, హమ్ సబ్ కరోనా వైరస్ కో హరానే మే ఏక్ సాథ్ హై, హమ్ సబ్ అప్నే అప్నే సర్కార్ కి బాత్ కా నిర్దేశ్ కరే ఔర్ ఘర్ మే కుచ్ దినో కే లియే రహే, యే సమయ్ హై హోసియార్ రహనే కా. ఆప్ సభీ కో దేర్ సారా ప్యార్’’ అని హిందీలో ట్వీట్ చేశాడు. కాగా, భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంటి వారు కూడా కరోనా వైరస్‌పై అభిమానుల్లో అవగాహన పెంచే ట్వీట్లు చేశారు. 

కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బంది సేవలను ప్రశంసించారు. తమ గురించి తాము ఆలోచించకుండా సేవలో మునిగిపోయారని కొనియాడారు. కాగా, కెవిన్ పీటర్సన్ హిందీ ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధన్యవాద్ అని కొందరు, ఈసారి హిందీలో మాట్లాడుతూ వీడియో పోస్టు చేయాలని మరికొందరు కామెంట్ చేశారు. ఇక నుంచి నీ పేరు ‘కుల్‌భూషణ్ ప్రజాపతి’ అని మరొకరు కామెంట్ చేస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు.