న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పరోక్షంగా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి చురకలు అంటించారు. అలిసిపోయామని భావిస్తే భారత్ తరఫున క్రమం తప్పకుండా అంతర్జాతీయ మ్యాచులు ఆడే క్రికెటర్లు ఐపిఎల్ నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు. తమకు విశ్రాంతి లేదని, వరుసగా మ్యాచులు ఆడుతున్నామని విరాట్ కోహ్లీ ఇటీవల అన్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే కపిల్ దేవ్ ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల షెడ్యూల్ వరుసగా ఉండి, విశ్రాంతి తీసుకోవడానికి వీలు కావడం లేదని భావించేవాళ్లు ఐపిఎల్ నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు. 

Also Read: బౌన్సీ వికెట్లపై గెలువలేదా: కోహ్లీ సేనపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

"ఐపిఎల్ లో నువ్వు దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదు. అందువల్ల అలసిపోయానని నువ్వు భావిస్తే ఐపిఎల్ ఆడొద్దు. నువ్వు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ భిన్నంగా ఉంటుంది" అని కపిల్ దేవ్ అన్నారు.

దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆటగాడు పూర్తి స్థాయిలో శక్తిసామర్థ్యాలను ఉపయోగించి తగినంత అందివ్వాలని, ఈ విషయంలో రాజీ పడకూడదని, ఎందుకంటే వాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ లో పూర్తి శక్తి సామర్థ్యాలు పెడుతున్నారని ఆయన అన్నారు. 

న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ ను కోల్పోయి, తొలి టెస్టు మ్యాచు ఓడిపోయిన నేపథ్యంలో భారత ఆటగాళ్లు అలసిపోయారని భావిస్తున్నారా అని అడిగితే కపిల్ దేవ్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. తనకు తెలియదని, టీవీల్లో చూసి ప్రకటనలు చేయడం కష్టమని, అది నిజాయితీ అనిపించుకోదని అన్నారు. 

Also Read: ధోనీ దేశం కోసం చాలా చేశాడు.. టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే... కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

సిరీస్ సాగుతున్నప్పుడు ఆడుతూ పోతామని, పరుగులు లేదా వికెట్లు రానప్పుడు అలసిపోయినట్లు అవుతుందని, నువ్వు ఫలితాలు సాధించినప్పుడు అది జరగదని, ఏడు వికెట్లు తీసుకుని, 20 - 30 ఓవర్లు వేసినా అలసట కలగదని, పది ఓవర్లు వేసి 80 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోకపోతే అలసిపోయినట్లు అనిపిస్తుందని కపిల్ దేవ్ అన్నారు. 

అది భావోద్వేగానికి సంబంధించిన విషయమని, నీ మెదడుకూ మనసుకూ సంబంధించిన విషయమని, ఫలితాలు సాధిస్తే ఆనందంగా ఉంటుందని, తేలిక పడుతామని ఆయన అన్నారు.