ముంబై: క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) చీఫ్ పదవికి కపిల్ దేవ్ రాజీనామా చేశారు. కపిల్ దేవ్ తో పాటు మరో ఇద్దరు ప్యానెల్ సభ్యులు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఎథిక్స్ ఆఫీసర్ డిఎక్ జైన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద నోటీసులు జారీ చేశారు. 

భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి ఆదివారంనాడు ముగ్గురు సభ్యుల అడ్ హాక్ కమిటీకి రాజీనామా చేశారు. పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ ను ఎంపిక చేయడానికి అడ్ హాక్ సిఎసిలో తాను పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉందని ఆమె అన్నారు. 

తక్షణమే తన రాజీనామాను అంగీకరించాలని కోరుతూ కపిల్ దేవ్ ఈమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు నియమింిచన అడ్మినిస్ట్రేషన్ కమిటీ హెడ్ వినోద్ రాయ్ కి, బిసిసిఐ సిఈవో రాహుల్ జోహ్రీకి లేఖ రాసినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. 

హెడ్ కోచ్ గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన ముగ్గురు సభ్యులపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియన్ లైఫ్ మెంబర్ సంజీవ్ గుప్తా పిటిషన్ దాఖలు చేశారు బిసీసీఐ నియమావళి ప్రకారం.. ఎవరు కూడా ఒకటి కన్నా ఎక్కువ పదవులు కలిగి ఉండకూడదని ఆయన ఆ పిటిషన్ లో అన్నారు.