దేశవ్యాప్తంగా పక్షులకు సంబంధించి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయట పడడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

పెద్ద మొత్తంలో పక్షులు చనిపోతుండడంతో దీనిపై ఆందోళన మొదలయింది. ఫ్లూ భయంతో చికెన్, గుడ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చికెన్, గుడ్ల విక్రయాలను కూడా కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని ప్రారంభించిన కడక్‌నాథ్‌ కోళ్ల వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ సెగ తగిలింది. దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ విస్తరిస్తున్న నేపధ్యంలో ధోని ఆర్డర్‌ చేసిన రెండు వేల కడక్‌నాథ్‌ కోళ్లను, గ్రామ ప్రియ కోళ్ల ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

ధోని ఆర్డర్‌ చేసిన కోళ్లు రవాణాకు సిద్దమైన తరుణంలో బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్‌ విశ్వరాజన్‌ దృవీకరించారు. ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ... రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్‌లో ఆర్గానిక్‌ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పాడు.

దీనిలో అత్యధిక పోషక విలువలు కలిగిన నల్లకోళ్లు (కడక్‌నాథ్‌ కోళ్లు) అలాగే హైదరాబాద్‌ ప్రాంతంలో లభ్యమయ్యే గ్రామప్రియ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ఈ రకం కోళ్లు మాంసం ఆరోగ్య సంరక్షణలోనూ, సంతానోత్పత్తిని పెంపొందించడంలోనూ సత్ఫలితాల్నిస్తున్నాయి.

కడక్‌నాథ్‌ చికెన్‌ ధర కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు, గ్రామ ప్రియ చికెన్‌ కూడా అదే ధర పలుకుతుంది. మన దేశంలో కడక్‌నాథ్ చికెన్‌ పేరుతో పిలువబడే నల్లకోళ్ళను మధ్యప్రదేశ్‌లోని ఝబువా ప్రాంతం నుంచి గ్రామప్రియ కోళ్లను హైదరాబాద్‌ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారు.