బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023: గాయంతో స్వదేశానికి పయనమైన జోష్ హజల్‌వుడ్... 100 శాతం ఫిట్‌నెస్ సాధించిన మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్.. మూడో టెస్టులో బరిలోకి!
ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హజల్‌వుడ్ గాయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 మొత్తానికి దూరమయ్యాడు. జోష్ హజల్‌వుడ్ గాయం నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అతను ట్రీట్‌మెంట్ కోసం స్వదేశానికి బయలుదేరి వెళ్లనున్నాడు...
తొలి రెండు టెస్టులకు దూరమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పూర్తిగా కోలుకున్నారు. ఈ ఇద్దరూ 100 శాతం ఫిట్‌నెస్ సాధించారని, ఇండోర్‌లో జరిగే మూడో టెస్టులో ఆడతారని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రకటించాడు..
‘జోష్ హజల్‌వుడ్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అతను ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. డేవిడ్ వార్నర్ మోచేతి గాయం ఇంకా కోలుకోలేదు. అయితే అతని గాయం గురించి ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం కష్టం...
మూడో టెస్టుకి వారం సమయం ఉంది కాబట్టి ఆ సమయానికి వార్నర్ కోలుకుంటాడా? లేదా? అనేది చూస్తాం. ఒకవేళ డేవిడ్ వార్నర్ మూడో టెస్టు సమయానికి కోలుకోకపోతే అతని ప్లేస్‌లో ట్రావిస్ హెడ్‌ని ఆడిస్తాం...
ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా ఏం చేయగలడో అందరూ చూశారు. మిడిల్ ఆర్డర్‌లో కూడా రాణించగలడు. కామెరూన్ గ్రీన్ కూడా వేగంగా కోలుకుంటున్నాడు. బెంగళూరులో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇప్పటికే వేలి గాయంతో కాస్త ఇబ్బంది పడుతున్నాడు..
మూడో టెస్టు సమయానికి కామెరూన్ గ్రీన్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడనే నమ్మకం ఉంది. భారత ఉపఖండ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆస్ట్రేలియా జట్టుకి కాస్త సమయం పడుతోంది. మిచెల్ స్టార్క్ కోలుకోవడం మాకు బాగా కలిసి వచ్చే విషయం. అతనికి ఇండియాలో చాలా మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. అది మాకు రాబోయే టెస్టుల్లో బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం...’ అని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్...
కామెరూన్ గ్రీన్ గాయం నుంచి కోలుకోవడం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏకంగా రూ.17 కోట్ల 50 లక్షలు పెట్టి కామెరూన్ గ్రీన్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అతను గాయపడడంతో ముంబై ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఐపీఎల్ ఆడడం అనుమానమేనని డౌట్స్ రేగినా వేగంగానే కోలుకున్న గ్రీన్, మూడో టెస్టులో బరిలో దిగబోతున్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో సిడ్నీకి బయలుదేరి వెళ్లాడు. కొన్నిరోజులు సిడ్నీలో తన కుటుంబంతో ఉండే ప్యాట్ కమ్మిన్స్, ఇండోర్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు సమయానికి తిరిగి జట్టుతో కలుస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలియచేసింది. ఒకవేళ ప్యాట్ కమ్మిన్స్ రాక ఆలస్యమైతే టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్, ఇండోర్‌లో జరిగే మూడో టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు...
మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి ఇంకా 8 రోజుల సమయం ఉండడంతో ప్యాట్ కమ్మిన్స్ తిరిగి, టీమ్‌తో కలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
