Jos Buttler: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. యాషెస్ సిరీస్ లో అతడి క్యాచ్ డ్రాపుల కథ కొనసాగుతూనే  ఉంది.  

చెత్త వికెట్ కీపింగ్ తో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా రెండో రోజు అతడు మరో సింపుల్ క్యాచ్ జారవిడిచాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సిరీస్ లో మొదటి, రెండో టెస్టులో కూడా బట్లర్.. ఆసీస్ ఆటగాళ్లు ఇచ్చిన ఈజీ క్యాచులను జారవిడిచి విమర్శల పాలైన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో బట్లర్.. ఆసీస్ మిడిల్ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ క్యాచ్ ను జారవిడిచాడు.

ఇంగ్లాండ్ బౌలర్ జాక్ లీచ్ వేసిన 50వ ఓవర్ తొలి బంతికి హెడ్ ఇచ్చిన క్యాచ్ ను బట్లర్ అందుకోలేకపోయాడు. తొలి టెస్టులో హెడ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక హెడ్ క్యాచ్ ను బట్లర్ మిస్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది. దీంతో ఇంగ్లాండ్ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Scroll to load tweet…

పలువురు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘బ్యాటింగ్ చేయడు.. బౌలింగ్ చేయడు.. క్యాచులు కూడా పట్టడు.. ఇంగ్లాండ్, జోస్ బట్లర్..’ ‘జోస్ బట్లర్ కోవిడ్ ను యాషెస్ ను పట్టలేడు..’ అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. 

రెండో టెస్టులో కూడా బట్లర్.. ఆసీస్ ఆటగాడు లబూషేన్ ఇచ్చిన రెండు క్యాచులు మిస్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఆ టెస్టు తొలి ఇన్నింగ్సులో సెంచరీ చేయగా.. రెండో ఇన్నింగ్సులో హాఫ్ సెంచరీ సాధించాడు. లబూషేన్ తో పాటు తొలి టెస్టులో స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను కూడా బట్లర్ డ్రాప్ చేశాడు.

Scroll to load tweet…

వికెట్ కీపర్ గా అతడు వరుసగా విఫలమవుతుండటంతో ఇంగ్లాండ్ యాజమాన్యం కూడా అతడిపై అసహనంగా ఉంది. వచ్చే టెస్టులో అతడిని తప్పించి జానీ బెయిర్ స్టో ను ఆడించేందుకు సన్నాహాలు చేస్తుంది. వికెట్ కీపర్ గా విఫలమవుతున్న బట్లర్.. బ్యాటర్ గా కూడా రాణించడం లేదు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో బట్లర్.. 3 పరుగులకే ఔటయ్యాడు. కానీ అడిలైడ్ టెస్టులో అతడి పోరాటం ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ ను ఓటమి నుంచి తప్పించడానికి అతడు 207 బంతులాడి 26 పరుగులు చేశాడు. 

ఇదిలాఉండగా.. ఇప్పటికే రెండు టెస్టులలో ఓడిన ఇంగ్లాండ్ మూడో టెస్టులో కూడా ఓటమి అంచుల్లో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్సులో కూడా అదే తడబాటు ప్రదర్శిస్తున్నది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్ (12 నాటౌట్), బెన్ స్టోక్స్ (2 నాటౌట్) ఉన్నారు. మరో మూడు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ కు మరో పరాభావం తప్పేలా లేదు.