భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల అఫ్రిదీ ప్రధానమంత్రి నరెంద్రమోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గంభీర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అక్కడితో ఆగలేదు... సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 

కశ్మీర్ కోసం గత 70 ఏళ్లుగా పాకిస్థాన్ బిచ్చమెత్తుకుంటుందని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ ఇద్దరు చాలా సార్లు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగిన విషయం తెలిసిందే.

‘పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. అలాంటి దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా?'అని అని గంభీర్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా... కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరకులు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన ఈ పాక్ మాజీ కెప్టెన్ అక్కడి స్థానికులతో మాట్లాడూతు భారత్‌పై తనకున్న విద్వేషాన్ని చాటుకున్నాడు. 

దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో అఫ్రిది..  ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఉద్దేశించి భారత ప్రధాని మోదీ, భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 

‘పాకిస్థాన్‌‌ సైనిక బలం 7 లక్షలు కాగా.. అంతమంది భారత సైనికులను మోదీ కేవలం కశ్మీర్‌లోనే మోహరించారు. మీ అందమైన గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నా. చాలా కాలం నుంచి మీ అందరిని కలవాలనుకుంటున్నా. ప్రపంచం కరోనా అనే మహమ్మారితో పోరాడుతుంది. కానీ నరేంద్ర మోదీ మనస్సులో దానికి మించిన వ్యాధి ఉంది'అని వ్యాఖ్యానించాడు. భారత్‌కు కశ్మీర్‌లు కూడా పాక్ ఆర్మీకే మద్దతు ఇస్తున్నారనీ తెలిపాడు. ఆఫ్రిది డైలాగ్‌లకు పాక్ సైనికులు చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో.. ఆ కామెంట్స్ కి తనదైన శైలిలో గంభీర్ తిప్పికొట్టడం విశేషం. మరి గంభీర్ కౌంటర్ కి అఫ్రీది ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.