పోర్ట్ ఎలిజిబెత్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచులో ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్ లో విఫలమైన జో రూట్ బౌలింగులోనైనా ప్రతిభ కనబరుద్దామని భావించాడు. అయితే, బౌలింగ్ లో అతను అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. 

మ్యాచ్ రెండో ఇన్నింగ్సు 82వ ఓవర్ వేసిన రూట్ ఆ ఓవరులో 28 పరుగులు సమర్పించుకున్నాడు.  దాంతో అతను టెస్టు మ్యాచుల్లో ఒక ఓవరులో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా తన సహచర క్రికెటర్ జేమ్స్ అండర్సన్ సరసన చేరాడు.

2013-14 యాషెస్ సిరీస్ లో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచులో అండర్సన్ ఒక ఓవరులో 28 పరుగులు ధారపోశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ కూడా జోహెన్ బర్గ్ వేదికగా జరిగిన మ్యాచులో అన్నే పరుగులు సమర్పించుకున్నాడు. 

దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ తన బ్యాట్ ద్వారా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ వేసిన ఓవరులో అతను 24 పరుగులు సాధించాడు. ఓవరులోని తొలి ఐదు బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లు బాదాడు. చివరి బంతి బైస్ గా ఫోర్ గా వెళ్లింది. దాంతో ఒక్క ఓవరులో జో రూట్ ఆ విధంగా 28 పరుగులు సమర్పించుకున్నాడు.

అయితే, దక్షిణాఫ్రికాపై తాజాగా జరిగిన మ్యాచులో ఇంగ్లాండు విజయం సాధించింది. దాంతో ఇంగ్లాండు దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో సిరీస్ ఆధిక్యతను సాధించింది.  సిరీస్ లో చివరి మ్యాచ్ జనవరి 24వ తేదీన జోహన్నెస్ బర్గ్ లో ప్రారంభం కానుంది.