సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో దుమ్ముదులిపిన ఆర్సీబీ కెప్టెన్.. తొలి సెంచరీతో రికార్డులలోకి..
SA 20: సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఎ20 లో జోబర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై వాళ్లది) సారథి ఫాఫ్ డుప్లెసిస్ శతకంతో రెచ్చిపోయాడు. మినీ ఐపీఎల్ గా భావించే ఎస్ఎ20లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.
ఐపీఎల్ లో 2021 సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో ఉండి 2022 సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మారిన దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్.. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఎ20లో సీఎస్కే పెట్టుబడులు పెట్టిన జోబర్గ్ సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డుప్లెసిస్.. ఈ లీగ్ లో సెంచరీతో మెరిశాడు. ఫలితంగా ఎస్ఎ 20 లో తొలి శతకం నమోదుచేసిన క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు.
ఈ ఏడాది నుంచే మొదలైన ఈ లీగ్ లో డుప్లెసిస్ చేసిందే తొలి శతకం. డర్బన్ సూపర్ జెయింట్స్(లక్నో టీమ్) తో మంగళవారం ముగిసిన లీగ్ మ్యాచ్ లో డుప్లెసిస్.. 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో అతడు.. 58 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
ఎస్ఎ 20లో డుప్లెసిస్ కంటే ముందు విల్ జాక్స్ చేసిన 92 పరుగులే అత్యధికం. ప్రిటోరియా క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ లో జాక్స్.. 46 బంతుల్లోనే 92 పరుగులు చేసి సెంచరీకి దగ్గరగా వచ్చినా తృటిలో మిస్ అయింది. కానీ డుప్లెసిస్ మాత్రం.. డర్బన్ బౌలర్లను ఉతికారేసి సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో డుప్లెసిస్.. లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. జోస్ బట్లర్ (పార్ల్ రాయల్స్) .. 8 మ్యాచ్ లలో 285 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉండగా.. డుప్లెసిస్ 7 మ్యాచ్ లలో 277 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్.. (48 బంతుల్లో 65, 7 ఫోర్లు), హోల్డర్ (12 బంతుల్లో 28 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం లక్ష్యాన్ని జోబర్గ్ సూపర్ కింగ్స్.. 19.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 182 పరుగులు చేసింది. డుప్లెసిస్ తో పాటు రీజా హెండ్రిక్స్ (45) రాణించాడు.