వుమెన్ టీ20 ఛాలెంజ్‌‌లో ఐపీఎల్ తరహా ఉత్కంఠభరిత మ్యాచ్ సాగింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న సూపర్ నోవాస్, స్మృతి మంధాన జట్టు ట్రైయల్‌బ్లేజర్స్‌తో కలిసి ఫైనల్‌ చేరింది. మిథాలీరాజ్ జట్టు వెలాసిటీ మొదటి మ్యాచ్‌లో గెలిచినా, రెండో మ్యాచ్‌లో 47 పరుగులకే ఆలౌట్ కావడంతో రన్‌రేట్ భారీగా పడిపోయి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.

147 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ట్రైయల్ బ్లేజర్స్‌కి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. డియాండ్రా డాటిన్ 15 బంతుల్లో 27 పరుగులు చేయగా కెప్టెన్ స్మృతి మంధాన 40 బంతుల్లో 33 పరుగులు చేసింది. రిచా ఘోష్ 4 పరుగులు, హేమలత 4 పరుగులకే అవుట్ అయినా దీప్తి శర్మ, హెర్లీన్ డియోల్ కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు.

29 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించి హెర్లీన్ అవుట్ అయ్యింది. హెర్లిన్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేయగా దీప్తి శర్మ 40 బంతుల్లో 5 ఫోర్లతో 43 పరుగులు చేసింది.

రెండు బంతుల్లో 4 పరుగులు కావాల్సిన సమయంలో హెర్లీన్ అవుట్ కావడం, ఆఖరి బంతికి సింగిల్ మాత్రమే రావడంతో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది సూపర్ నోవాస్. సూపర్ నోవాస్, ట్రైయల్ బ్లేజర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ సోమవారం జరగనుంది.