స్వదేశంలో సౌతాఫ్రికాతో ముగిసిన టీ20 సీరిస్ ను అందుకోలేకపోయిన టీమిండియా ఎలాగైనా టెస్ట్ సీరిస్ ను మాత్రం గెలిచితీరాలని పట్టుదలతో వుంది. దీంతో ఇప్పటికే మొదటి టెస్ట్ జరగనున్న విశాఖపట్నానికి చేరుకున్న కోహ్లీసేన ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది. ఇలా పక్కావ్యూహాలతో బరిలోకి దిగి విజయాన్ని అందుకోవాలనుకుంటున్న భారత జట్టుకు టెస్ట్ సీరిస్ ఆరంభానికి ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఈ సీరిస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇది భారత జట్టు విజయావకాశాలపై ఖచ్చితంగా ప్రభావం చూపనుందని అభిమానులతో పాటు విశ్లేషకులు భావిస్తున్నారు. 

అయితే గాయం కారణంగా భారత జట్టుకు దూరమవడంపై తాజాగా బుమ్రా స్పందించాడు. '' క్రీడల్లో గాయాలనేవి సహజం. క్రీడాకారులు గాయపడటం, కోలుకొని మళ్లీ పునరాగమనం చేయడం రెగ్యులర్ ప్రక్రియ. అయితే ఆ పునరాగమనం ఎంత అద్భుతంగా వుందనేదే ముఖ్యం. నేను కూడా ఈ గాయం నుండి త్వరగా కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో పునరాగమనం చేయాలనుకుంటున్నా. 

నేను గాయంతో బాధపడుతున్నట్లు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నేను ఎప్పుడూ తలెత్తుకు జీవించాలనే అనుకుంటా. కాబట్టి భారత జట్టులోకి మళ్లీ సగర్వంగా అడుగుపెట్టాలన్నదే ప్రస్తుతం నాముందున్న లక్ష్యం. ఆ దిశగానే ఇకపై నా ప్రయత్నాలు వుంటాయి.'' అంటూ బుమ్రా తన గాయంపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు.

గతకొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడటం వల్ల బుమ్రా వెన్నునొప్పి తిరగబెట్టింది. అతడి వెన్నెముక కిందిభాగంలో చిన్న చీలిక వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. కాాబట్టి కొంతకాలం విరామం అవసరమని సూచించారు. దీంతో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్ నుండి బుమ్రాను తప్పిస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ కు అవకాశం కల్పించారు. నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే సీరిస్ కు కూడా అతడు దూరమయ్యే అవకాశాలున్నాయి. 
 
 

సంబంధిత వార్తలు 

టీమిండియాకు బిగ్ షాక్... టెస్ట్ సీరిస్ నుండి బుమ్రా ఔట్