ఇప్పటికే స్వదేశంలో జరిగిన టీ20 సీరిస్ ను సాధించలేక నిరాశతో వున్న టీమిండియాకు మరోపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా సౌతాఫ్రికాతో త్వరలో జరగనున్న టెస్ట్ సీరిస్ కు దూరమయ్యాడు. ఈ మేరకు బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న అతడికి ఈ టెస్ట్ సీరిస్ నుండి విశ్రాంతినివ్వాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అతడి స్థానంలో మరో పేసర్ ఉమేశ్ యాదవ్ టీమిండియా తరపున ఈ టెస్ట్ సీరిస్ ఆడనున్నట్లు బిసిసిఐ తన ప్రకటనలో పేర్కొంది. 

వెస్టిండిస్ తో ఇటీవలే ముగిసిన టెస్ట్ సీరిస్ లో బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. కేవలం రెండు మ్యాచుల్లోనే అతడు 13 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా వుండటం విశేషం. ఇలా మంచి ఫామ్ లో వున్న సమయంలో బుమ్రా దూరమవడం టీమిండియా ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం వుంది. 

బుమ్రా ఈ సీరిస్ మొత్తానికి దూరమవడంతో ఉమేశ్ యాదవ్ కు కలిసివచ్చింది. 2018 చివర్లో  ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సీరిస్ లో ఉమేశ్ కు చివరి అవకాశం లభించింది. ఆ తర్వాత అతడు మళ్లీ అంతర్జాతీయ టెస్టుల్లో పాల్గొనలేదు. తాజాగా బుమ్రా అనూహ్యంగా జట్టునుండి తప్పుకోవడం సౌతాఫ్రికాతో తలపడే అవకాశం లభించింది. సీనియర్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలతో కలిసి అతడు బంతిని పంచుకోనున్నాడు. 

ఉమేశ్ యాదవ్ ఇప్పటివరకు 41 టెస్ట్ మ్యాచుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 33.47 సగటుతో 119 వికెట్లు పడగొట్టాడు. ఈ సంవత్సరంలో అతడి బౌలింగ్ ఎకానమీ 3.58 గా వుండగా...రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 

భారత్-సౌతాఫ్రికాల మధ్య అక్టోబర్ 2 నుండి టెస్ట్ సీరిస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ విశాఖ పట్నంలో జరగనుంది. అలాగే రెండోది పూణేలో మూడో టెస్ట్ రాంచీ వేదికన జరగనుంది. ఈ మూడు టెస్టులకు బుమ్రా దూరమయ్యాడు.