టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా  వెన్ను నొప్పి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న బుమ్రా... తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేశాడు. తెలుపు రంగు సూటు ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫోటో వెంటనే వైరల్ అయ్యింది. ప్లేయింగ్ ఇట్ కూల్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు బుమ్రా.

దీంతో నెటిజన్లు "ఎక్కడున్నావ్" అని ట్విట్టర్‌లో అడగడం మొదలుపెట్టారు. అంతేకాదు, త్వరగా జట్టులో చేరాలని ఓటమి నుంచి టీమిండియాను తప్పించాలని కోరుకుంటా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. 

కాగా... బుమ్రా ఈ ఫోటోకి సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లు స్పందించారు. హర్భజన్ సింగ్... ఒకప్పటి బాలీవుడ్ హీరో ‘దేవ్ ఆనంద్’ లా ఉన్నావంటూ కామెంట్ చేయగా.. యువరాజ్ సింగ్ మాత్రం కూల్ అంటూ కామెంట్  చేశాడు.

అయితే... హర్భజన్ చేసిన కామెంట్స్ కి నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కొందరు నిజంగానే లెజెండరీ యాక్టర్ దేవ్ ఆనంద్ లా ఉన్నావ్ అంటుండగా... మరొకొందరు మాత్రం డూప్లికేట్ దేవ్ ఆనంద్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే బుమ్రా ఈ ఫోటోలో చాలా స్టైలిష్ గా కనిపించాడు.

ఇదిలా ఉంటే... మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్) రాణించడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

దీంతో.. ఈ మ్యాచ్ లో బుమ్రాని బాగా మిస్సయ్యామని.. త్వరగా వచ్చి జట్టులో చేరాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా... బుమ్రా ఐపీఎల్‌లో ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌‌ల సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. నడమ కింది భాగంలో నొప్పితో సతమవుతున్న బుమ్రా కొన్ని రోజులుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.