ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌కు మంచి గుర్తింపు  వుంది. మలింగ తర్వాత యార్కర్లు సంధించడంలో బుమ్రా సిద్ధహస్తుడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న బుమ్రా నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఓ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

మాజీ, ప్రస్తుత అంతర్జాతీయ బౌలర్‌లలో ఆరుగురి బౌలింగ్ యాక్షన్‌ను చేసి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇదే సమయంలో బుమ్రా ఎవరెవరి బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించాడో గుర్తుపట్టమని అభిమానులకు అడిగింది. మునాఫ్ పటేల్, గ్లెన్ మెక్‌గ్రాత్, మిచెల్ స్టార్క్ , కేదార్ జాదవ్ , శ్రేయాస్ గోపాల్, అనిల్ కుంబ్లేలా జస్ప్రీత్ బౌలింగ్ చేశాడు. అందరిలోకెల్లా అనిల్ కుంబ్లేను బాగా అనుకరించాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వీరిలో తమకు తెలిసిన బౌలర్ల పేర్లను ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే కొందరు సరైన సమాధానాలే చెప్పినా.. మరికొందరు మాత్రం తప్పుగా చెబుతున్నారు.

మరోవైపు గతేడాది ముంబై ఇండియన్స్ జట్టు నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలో దిగనుంది. సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై తలపడనుంది. 

ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయమై ఆ ఫ్రాంఛైజీ గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైన ఉంగరాలు అందించింది. అందరూ కచ్చితంగా వాటిని ధరించాల్సి ఉంటుంది.

దాంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, కరోనా లక్షణాలు లేకుండా వైరస్‌ బారిన పడినా శరీరంలో చోటుచేసుకునే మార్పులను గమనించి వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వీలు కలుగుతుంది.