చెప్పాల్సింది చెప్పాం.. ఇక మా చేతుల్లో ఏమీలేదు.. అంతా వాళ్లిష్టం : కీలక టోర్నీల ముందు రోహిత్ వ్యాఖ్యలు
IPL 2023: ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. ఇక భారత క్రికెట్ జట్టు రెండు నెలల దాకా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడదు. సందడంతా ఐపీఎల్ లోనే..

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని విజయవంతంగా చేజిక్కించుకున్న భారత జట్టు తర్వాత జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం విఫలమైంది. చెన్నైలో నిన్న ముగిసిన మూడో వన్డేలో ఓడిన భారత జట్టు.. 1-2 తేడాతో వన్డే సిరీస్ ను కంగారూలకు సమర్పించుకుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు మరో రెండున్నర నెలల దాకా అంతర్జాతీయ మ్యాచ్ ఆడదు. ఈనెల చివరినుంచి మే మాసాంతం వరకూ భారత క్రికెటర్లు ఐపీఎల్ లో కనిపించనున్నారు. అభిమానులకు ఇది ఒకింత సంతోషమే అయినప్పటికీ కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో భారత జట్టుకు అది ఆందోళనకరమైనదే..
తాజాగా ఇదే విషయమై టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. రెండు నెలల పాటు ఐపీఎల్ లో ఆడే భారత క్రికెటర్లు.. ఆ వెంటనే ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో పాటు అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ ఆడాల్సి ఉండగా వాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆసీస్ తో మూడో వన్డే ముగిశాక రోహిత్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు అది (ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్) మా చేతుల్లో లేదు. ఇకపై ఆటగాళ్లంతా ఫ్రాంచైజీల సొంతం. క్రికెటర్ల వర్క్ లోడ్ గురించి మేం ఇదివరకే వాళ్ల (ఫ్రాంచైజీలకు) కొన్ని సూచనలు ఇచ్చాం. అయితే చివరకు తుది నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే.. అన్నింటికంటే ముఖ్యంగా క్రికెటర్లు ఎవరి బాడీ పట్ల వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. వాళ్లేం చిన్నపిల్లలు కాదు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ విషయాన్ని వెంటనే ఫ్రాంచైజీలకు వెల్లడించి కొన్ని గేమ్ లు ఆడకుండా ఉండటమే మంచిది...’అని తెలిపాడు.
అది ఆందోళనకరమే..
ఆటగాళ్లు తరుచూ గాయాల బారీన పడటం ఆందోళకరమే అని హిట్‌మ్యాన్ చెప్పాడు. ‘అవును. ఆటగాళ్ల గాయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయన్నది నిజమే. తుది జట్టులో ఉండే క్రికెటర్లను చాలా మిస్ అవుతున్నాం. అందరూ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాం. అయినా వాళ్లు ఎందుకు గాయపడుతున్నారో చెప్పేందుకు నేనేమీ స్పెషలిస్టును కాను. వన్డే వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ జట్టును రెడీగా ఉంచేందుకు తమ మెడికల్ టీమ్స్ పనిచేస్తున్నాయి’ అని రోహిత్ వెల్లడించాడు.
వాటిని కంట్రోల్ చేయలేం..
ఆటగాళ్లు తరుచూ క్రికెట్ ఆడితే గాయాలవడం సర్వ సాధారణమేనని , అయితే మన చేతుల్లో లేని విషయాలను కంట్రోల్ చేయలేమని రోహిత్ అన్నాడు. ‘తరుచూ క్రికెట్ ఆడటం వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. మేం అందుబాటులో ఉన్నవారితోనే బరిలోకి దిగుతున్నాం. అయితే మన చేతుల్లో లేని వాటిని కంట్రోల్ చేయలేం. ఆటగాళ్లూ ప్రతీ మ్యాచ్ ఆడాలనే కోరుకుంటారు. వారికి గాయాలు కాకుండా ఉంచేందుకు మా మెడికల్ టీమ్, సపోర్ట్ స్టాఫ్ కూడా పనిచేస్తోంది. అయినా గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేసేందుకు మేం యత్నిస్తున్నాం..’అని రోహిత్ వివరించాడు.