22 ఏళ్ల తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు... ఆటకి అడ్డంకిగా మారిన వాన..
క్వీన్స్ పార్క్ ఓవల్‌లో ఇండియా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుని వరుణుడు వదలడం లేదు. మూడో రోజు ఆటలో వర్షం కారణంగా ఓవర్లు నష్టపోగా, నాలుగో రోజు కూడా ఆటకు వాన అడ్డుపడింది. రోహిత్ శర్మ అవుట్ కాగానే వర్షం అంతరాయం కలిగించడంతో లంచ్ బ్రేక్ తీసుకున్నారు అంపైర్లు. 15 ఓవర్ల ఆట ముగియగానే వరుణుడు మరోసారి పలకరించడంతో టీ బ్రేక్ కూడా త్వరగానే తీసుకోవాల్సి వచ్చింది..
వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది టీమిండియా. 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, గ్యాబ్రియల్ బౌలింగ్‌లో అల్జెరీ జోసఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఓపెనర్ల దూకుడైన బ్యాటింగ్ కారణంగా 12.2 ఓవర్లలోనే 100 పరుగుల స్కోరు దాటేసింది టీమిండియా..
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ రికార్డు. ఇంతకుముందు టెస్టుల్లో ఏ జట్టు కూడా ఇంత వేగంగా 100 పరుగుల మైలురాయిని చేరుకోలేదు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత వర్షం రావడంతో 100 కొట్టడానికి కాస్త ఆలస్యం జరిగింది. లేకపోతే 12 ఓవర్లలోపు 100 చేరుకునేది టీమిండియా. వెస్టిండీస్ ఫీల్డర్లు క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ, విండీస్ టూర్‌లో వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు నమోదు చేశాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, వర్రీకాన్ బౌలింగ్‌లో జోషువా డి సిల్వకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
మ్యాచ్‌లో సమయం తక్కువగా ఉండడంతో వేగంగా ఆడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలనే ఉద్దేశంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి పంపించింది టీమిండియా. టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఆరో భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్..
ఇంతకుముందు 1956లో నరేన్ తమ్‌హారే, 1960లో బుది కుందేరన్, 1971లో ఫరూక్ ఇంజనీర్, 1978లో సయ్యద్ కిర్మణీ (రెండు సార్లు), 2001లో నయన్ మోంగియా... టెస్టుల్లో టీమిండియా తరుపున నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్లుగా నిలిచారు.
2018లో పార్థివ్ పటేల్, మురళీ విజయ్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఆ తర్వాత టాప్ 4లో బ్యాటింగ్‌కి వచ్చిన భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషనే..
తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన శుబ్‌మన్ గిల్, 10 బంతుల్లో 10 పరుగులు చేసి క్రీజులో ఉండగా ఇషాన్ కిషన్ 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 170+ స్ట్రైయిక్ రేటుతో కూడా కొన్ని మ్యాచుల్లో పరుగులు చేశాడు.అయినా విరాట్ కోహ్లీని కాదని ఇషాన్ కిషన్‌ని బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి పంపడం హాట్ టాపిక్ అవుతోంది.
