ప్రపంచ క్రికెట్ చరిత్రలో రన్ మెషిన్ గా అందరూ అభివర్ణించి విరాట్ కోహ్లీ చాలా కష్టపడి ఎదిగిన క్రికెటర్. తన ఆటతీరును రోజు రోజుకు మెరుగుపరుచుకుంటూ... షాట్లలో వైవిధ్యతను చూపెడుతూ తన ఇన్నింగ్స్ ను నిర్మించుకున్న ఒక ప్రభావశీల ఆటగాడు. 

సాహసం చేయకుండా ఫలితం పొందలేమనే సిద్ధాంతం బలంగా విశ్వసించే వారిలో కూడా టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుంటాడు. 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో పేలవమైన ప్రదర్శనతో తేలిపోయిన విరాట్‌ కోహ్లిని ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా అంగీకరించేందుకు కొందరు నిరాకరించారు. పైగా అనేక విమర్శలను గుప్పించారు కూడా. 

2018 పర్యటనలో శతకాల మోత మోగించిన కోహ్లి ఇంగ్లీష్‌ పిచ్‌లపై అదిరిపోయే మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. అలాంటి కోహ్లీపై సహజంగానే టీం ఇండియా అభిమానుల నుంచి జట్టు మానేజ్మెంట్ వరకు అనేక ఆశలను పెట్టుకోవడం సహజం. 

న్యూజిలాండ్‌ గడ్డపై భారత్ టెస్టు సిరీస్‌ విజయం గెలవొచ్చు అని ఆశించడానికి ఓ ప్రధాన కారణం విరాట్‌ కోహ్లి అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.  చివరకు అతడి వైఫల్యం సిరీస్‌ ఫలితంపై ఇంతటి ప్రభావం చూపుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలో అసలు విరాట్‌ కోహ్లి ఆటకు ఏమైందనే ప్రశ్నలు సర్వత్రా ఉద్భవిస్తున్నాయి. 

Also read: ఘోర పరాజయం... టాప్ ప్లేస్ కోల్పోయిన విరాట్ కోహ్లీ

ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో టీమ్‌ ఇండియా మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌. అందరి కళ్ళు ఆ వార్మ్ అప్ మ్యాచ్ పైన్నే ఉన్నాయి. కానీ అనూహ్యంగా విరాట్ కోహ్లీ అక్కడ దర్శనమివ్వలేదు. 

అప్పటికే కివీస్‌ పిచ్‌లపై కోహ్లిసేన ఎనిమిది మ్యాచులు ఆడేసింది. ఐదు టీ20ల్లో విజయాలు సాధించింది. మూడు వన్డేల్లో ఓటమి చవిచూసింది. పర్యటనలో రెండు సిరీస్‌లు క్లీన్‌స్వీప్‌లు అయిన అరుదైన సందర్భం అది. 

అందరి దృష్టి వార్మ్ అప్ టెస్టు పైన్నే. అనూహ్యంగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం వార్మప్‌ బరిలో నిలువలేదు. జట్టంతా న్యూజిలాండ్‌ పిచ్‌లపై తొలి ఇన్నింగ్స్‌ గండం దాటేదెలా అని వ్యూహ రచనలో ఉంది. బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి!. 

హామిల్టన్‌లోనే నెట్స్‌లో దర్శనమిచ్చిన విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌కు పదును పెట్టడంపై ఎనలేని దృష్టి సారించాడు. మూడు రోజుల ఆటలో మైదానంలో కనిపించని విరాట్‌ కోహ్లి, నెట్‌ సెషన్లలో మాత్రం కఠోరంగా శ్రమించాడు. 

న్యూజీలాండ్ టార్గెట్  విరాట్.... 

న్యూజిలాండ్‌ మూడు సిరీస్‌ల్లోనూ ఓ విషయంపై ఎంతో స్పష్టత పాటించింది. బ్యాటింగ్‌ లైనప్‌లో విరాట్‌ కోహ్లిని త్వరగా పెవిలియన్‌కు చేర్చటం. బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు భయపడకుండా యథేచ్చగా పరుగులు పిండుకోవటం. 

తొలి నాలుగు టీ20ల్లో విరాట్‌ కోహ్లి 45, 11, 38, 11 పరుగులు చేశాడు. మూడు వన్డేల్లో 51, 15, 9 పరుగులతో సరిపెట్టుకున్నాడు. మొత్తంగా న్యూజిలాండ్‌ పర్యటనలో విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఫిఫ్టీ ప్లస్‌ పరుగుల మార్క్‌ అందుకున్నాడు. 

విరాట్‌ కోహ్లి కవర్‌ డ్రైవ్‌ ఆడుతుంటే చూడాలని కోరుకోని వారు ఉండరు. కవర్‌ డ్రైవ్‌, ఫ్రంట్‌ పుట్‌ సైడ్‌ డ్రైవ్‌, ఆఫ్‌ డ్రైవ్‌, బ్యాక్‌ ఫుట్‌ సైడ్‌ డ్రైవ్‌లు ఆడటంలో విరాట్‌ కోహ్లి దిట్ట. టెస్టు క్రికెట్‌ కెరీర్‌లో విరాట్‌ కోహ్లి అత్యధికంగా పరుగులు సాధించింది ఈ షాట్‌తోనే. 

Also read: టీం ఇండియా పరిస్థితి: సాకు టాస్.... ఆడలేక మద్దలు ఓడడమేనా

1719 బంతుల్లో 1911 పరుగులు బాదాడు. 282 ఫోర్లు, 3 సిక్సర్లు కవర్‌ డ్రైవ్‌ నుంచి వచ్చినవే. కవర్‌ డ్రైవ్‌ను కోహ్లి ఎంతో నైపుణ్యంగా ఆడతాడు. ఆ షాట్‌తో వేగంగా పరుగులు పిండుకుంటాడు. 

ఫ్రంట్‌ ఫుట్‌ ను ఒకడుగు ముందుకు వేసి నిటారుగా నిల్చొని, బాల్ పై పూర్తి ఏకాగ్రతతో  ఇతర బ్యాట్స్‌మెన్‌ కూడా ఆడలేని బంతులను సైతం కవర్‌ డ్రైవ్‌లుగా మార్చగలడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ స్క్వేర్‌ కట్‌ చేసే బంతులు, మిగతా బ్యాట్స్‌మెన్‌ వదిలేసే బంతులను సైతం విరాట్‌ కోహ్లి కవర్‌ డ్రైవ్‌తో పరుగులు సాధిస్తాడు. 

ఈ షాట్‌తో అత్యధిక పరుగులు సాధించిన కోహ్లి.. 3045 బంతులను డిఫెండ్‌ చేస్తూ 25 సార్లు వికెట్‌ కూడా కోల్పోయాడు. టెస్టు క్రికెట్‌లో సాహసం చేస్తేనే ఫలితం అందుతుందని కోహ్లికి తెలుసు. ఎంతటి బౌలర్‌నైనా సులువుగా కవర్‌ డ్రైవ్‌తో కొట్టగలడు. 

కవర్‌ డ్రైవ్‌ విషయంలో కోహ్లి జడ్జిమెంట్‌ తప్పిన సందర్భాలు చాలా తక్కువ. అందుకు టెస్టుల్లో కోహ్లి సగటు 54.30 నిదర్శనం. న్యూజిలాండ్‌ మాత్రం విరాట్‌ కోహ్లి కోసం కొత్త పన్నాగం పన్నింది. 

వెల్లింగ్టన్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కైల్‌ జెమీసన్‌ ఓవర్లో విరాట్‌ కోహ్లి (అప్పటికి స్కోరు 2) కవర్‌ డ్రైవ్‌ కోసం ప్రయత్నించాడు. కానీ బంతి స్లిప్స్‌లోకి వెళ్లిపోయింది. అంతకముందు బంతులలో విరాట్‌ కోహ్లి వెనక్కి తగ్గి కవర్‌ డ్రైవ్‌ ఆడేలా జెమీసన్‌ వల పన్నాడు. చక్కటి షార్ట్‌ బాల్‌తో వికెట్‌ దక్కించుకున్నాడు. 

మౌంట్‌ మాంగనూయి వన్డేలో విరాట్‌ కోహ్లి ఆడిన తొలి ఐదు బంతుల్లోనే మూడు బంతులు బీట్‌ అయ్యాయి. ఏడో బంతినే గాల్లోకి లేపిన కోహ్లి సిక్సర్‌ సాధించాడు. సాధారణంగా కోహ్లి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే బంతిని గాల్లోకి లేపడు. ఎదుర్కొన్న 12వ బంతినే థర్డ్‌మ్యాన్‌ వద్ద క్యాచ్‌ ఇచ్చాడు. 

వెల్లింగ్టన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి తన షాట్లను ఆడేందుకు ఇష్టపడ్డాడు. రెండో బంతినే కవర్‌ డ్రైవ్‌తో బౌండరీ తరలించాడు. మరో డ్రైవ్‌ ఆడబోయి ఎనిమిదో బంతినే గల్లీలో గాల్లోకి లేపాడు. 

షార్ట్‌ బాల్‌పై ఎదురుదాడి చేసేందుకు సాహసం చేసిన కోహ్లి.. 43 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి బౌల్ట్‌ కు వికెట్‌ సమర్పించుకున్నాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు షార్ట్‌ బంతులతో దాడిచేసినప్పుడు, ఎదురుదాడితో సమాధానం ఇవ్వాలి గానీ, రక్షణాత్మకంగా ఆడి కివీస్‌కు ఆ బంతిని బలమైన ఆయుధంగా మార్చవద్దనేది కోహ్లి ఆలోచన. 

గణాంకాల పరంగా విరాట్‌ కోహ్లి ప్రదర్శన పేలవం. కానీ సాంకేతికంగా విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌లో పెద్ద లోపాలు లేవు. ఏ పరిస్థితుల్లోనైనా ఎదురుదాడి చేయటమే విరాట్‌ సిద్ధాంతం. మరి క్రైస్ట్‌చర్చ్‌లో అదే వ్యూహంతో విజయం అందుకుంటాడా, అతి దూకుడుతో న్యూజిలాండ్‌ చేతికి మరో ఆయుధం అందిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

తదుపరి మ్యాచులో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో దూకుడుగా ఆడి తన బ్యాటుతోనే విమర్శకుల నోర్లకు తాళాలు వేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తరువాతి మ్యాచులో విరాట్ ఆటతీరుపై సర్వత్రా చర్చ నడుస్తుంది. విరాట్ సైతం తన టెక్నీక్ లో ఎటువంటి లోపం లేదని అన్నాడు. చూడాలి మరి తరువాతి మ్యాచ్ లో ఏం చేయబోతున్నాడో!