దేశవాళీ క్రికెట్‌లో ప్రస్తుతం నెలకొన్న కృనాల్ పాండ్య × దీపక్‌ హుడా వివాదంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లు ఆటపై దృష్టిసారించాలంటే మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని పఠాన్ పేర్కొన్నాడు.

ఇలాంటి సంఘటనలు క్రీడాకారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పాడు. బరోడా క్రికెట్‌ అసోషియేషన్‌ (బీసీఏ) సభ్యులు వివాదంపై దృష్టిసారించి సత్వరమే పరిష్కరించాలని ఇర్ఫాన్ విజ్ఞప్తి చేశాడు.

ఆటకు ఆటంకం కలిగించే ఇలాంటి చర్యలను ఖండించాలని డిమాండ్ చేశాడు. క్రికెటర్లు సురక్షితంగా, స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని సృష్టించాలని పఠాన్ కోరాడు. దీపక్‌ హుడాకు జరిగింది నిజమైతే అది ఎంతో దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసే సంఘటనే అని అభిప్రాయపడ్డాడు. 

ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా జట్టు తరఫున ఆడుతున్న కృనాల్, దీపక్‌ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌ కృనాల్‌ తనని అసభ్యపదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ హుడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

46 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు, ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉన్న హుడా ఇలా బరోడా క్యాంప్‌ నుంచి వైదొలగడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బరోడా మాజీ కెప్టెన్‌ ఇర్ఫాన్‌ ట్వీట్ చేశాడు.  

అయితే ఈ వివాదంపై బరోడా క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సయ్యద్ ముస్తాక్‌ అలీ టోర్నీని బీసీసీఐ బయోబబుల్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో సత్తాచాటిన వారికి ఐపీఎల్‌ వేలంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.