టీమిండియా బౌలర్ ఇర్ఫానక్ పఠాన్ ఓ అరుదైన ఘనతను  సాధించే దిశగా అడుగులేస్తున్నాడు. ఇప్పటివరకు ఏ భారతీయ క్రికెటర్ కి సాధ్యం కాని  రికార్డును తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టగా త్వరలోనే ఆ కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇప్పటివరకు భారత క్రికెటర్లు ఎవరూ విదేశీ క్రికెట్ లీగుల్లో పాల్గొనలేదు. మొదటిసారిగా ఆ అవకాశం ఇర్పాన్  కు లభించింది. అతడు వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాడు.  అతడి అభ్యర్థనను మన్నించిన సిపిఎల్ నిర్వహకులు పఠాన్ పేరును వేలంపాటలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. దీంతో అతడిని ఏదైనా ఫ్రాచైజీ వేలంపాటలో దక్కించుకుంటే విదేశీ లీగ్ లో ఆడిన మొదటి భారత  ఆటగాడిగా ఇర్ఫాన్ పఠాన్ చరిత్ర సృష్టించనున్నాడు. 

అయితే ఈ లీగ్‌లో ఆడాలంటే ఇర్ఫాన్‌ కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. బిసిసిఐ ఏదైనా కారణాలతో అభ్యంతరం తెలిపితే పఠాన్ ఆశలు ఆవిరవనున్నాయి. అంతేకాదు బిసిసిఐ అనుమతించినా సిపిఎల్ లో పాల్గొంటున్న ఏదైనా ఫ్రాచైజీ పఠాన్ పై ఆసక్తి చూపిస్తేనే అతడికి ఆడే అవకాశం వస్తుంది. లేదంటే బిసిసిఐ అనుమతించినా లాభం లేకుండా పోతుంది. 

సిపిఎల్ కోసం మొత్తం 536 మంది విదేశీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నట్లునిర్వహకులు తెలిపారు. వీరిలో పఠాన్ తో పాటు  అప్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్,బంగ్లా క్రికెటర్ షకిబుల్ హసన్, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ డుమినీలు వున్నారు. వెస్టిండీస్‌ వేదికగా సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకూ సీపీఎల్‌ జరుగనుంది.